
రాళ్లవాగు.. రాకపోకలకు తిప్పలు
వెంకటాపురం(కె): మండల పరిధిలోని రాళ్లవాగుపై వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రాళ్లవాగు వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు వర్షాల కారణంగా బురదమయంగా మారిపోయింది. దీంతో రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఆర్టీసీ అధికారులు సైతం భద్రాచలం డిపోకు చెందిన బస్సులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మీదుగా వెంకటాపురం రావాల్సిన బస్సులను మణుగూరు టు ఏటూరునాగారం మీదుగా తిప్పుతున్నారు. దీంతో మండల పరిఽధిలోని ఎదిర గ్రామం నుంచి వెంకటాపురం వరకు ఉన్న గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సులు రాకపోవటంతో ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు వాగుపై వంతెన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.