
దారి ఇలా.. వెళ్లేదెలా?
ఏటూరునాగారం: ఏజెన్సీలోని కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలో తాత్కాలికంగా వేసిన మట్టిరోడ్డు బురదమయంగా మారింది. ప్రతిరోజూ తమ అవసరాల నిమిత్తం ప్రజలు వచ్చి వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇక బైక్‌పై వెళ్లాలనుకుంటే నరకయాతన పడాల్సిందే. ఇటీవల కురుస్తున్న వర్షాలతో మట్టిరోడ్డు అంతా దిగబడిపోతుందని.. ఈ దారిపై నుంచి ఎలా వెళ్లాలని ఆయా గ్రామాల ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
వరదలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి
2023 జూలై 27న కొండాయి బ్రిడ్జి అకాల వర్షాలతో వచ్చిన వరదలకు కొట్టుకుపోయింది. ఆ ఘటనలో 8 మంది జలసమాధి అయ్యారు. అప్పటి నుంచి ఎలాంటి దారిలేకపోయినా ఆయా గ్రామాల ప్రజలు కాలినడకనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాత్కాలికంగా మట్టి రోడ్డును ఓ ఇసుక కాంట్రాక్టర్ నిర్మించాడు. దాంతో కొంత మేర ప్రజలు రవాణా సాగించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు దొడ్ల– కొండాయి గ్రామాల మధ్యలోని జంపన్నవాగుపై ఉన్న మట్టిరోడ్డు బురదమయంగా మారిపోయింది. వాహనాలపై వెళ్తుంటే అందులో చిక్కుకుపోతున్న పరిస్థితి ఉంది. అలాగే కాలినడకన వెళ్తే కాలు తీసి కాలు వేయలేని దుస్థితి. ఒక పక్క వాగు నీరు ఉండడంతో ద్విచక్రవాహనాలు వెళ్లే పరిస్థితి లేదు.
40 కిలోమీటర్లు తిరిగి రావాలి..
కేవలం ఈ బురదరోడ్డు పైనే కొండాయి, గోవిందరాజుల కాలనీ, మల్యాల, ఐలాపురం గ్రామాల ప్రజలు రవాణా సాగించాల్సి ఉంది. ఈ రోడ్డు వల్ల వాహనాలు బయటకు వెళ్లే పరిస్థితి లేక ఊరట్టం, మేడారం, తాడ్వాయి మీదుగా ఏటూరునాగారం మీదుగా 40 కిలోమీటర్ల చుట్టూ తిరిగి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.
బురదమయంగా కొండాయి రోడ్డు
అవస్థలు పడుతున్న
నాలుగు గ్రామాల ప్రజలు
ముందుకు సాగని బ్రిడ్జి పనులు
రూ.16.50 కోట్లతో బ్రిడ్జి పనులు మొదలు పెట్టి నెలకావస్తోంది. అయినా పనులు ముందుకు సాగడం లేదు. దీంతో వర్షాలు కూడా తోడు అయ్యాయి. ఇక అంతే ఈ ఏడాది ఏ బ్రిడ్జిలేనట్లే.. మళ్లీ బురదరోడ్లే శరణ్యంగా మారాయి. పాలకుల నిర్లక్ష్యం గిరిజనులకు శాపంగా మారింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
బురదలో నుంచి నడిచిపోవాలి..
ఏ కష్టం వచ్చినా ఎలాంటి వాహనాలు రావు. నడుచుకుంటూ పోవాలి. ట్రాక్టర్లు తప్ప వేరే బండ్లు వచ్చే పరిస్థితి లేదు. మోకాలు లోతు బురద దిగబడిపోతుంది. కొండాయి నుంచి దొడ్ల వరకు 4 కిలోమీటర్లు నడవాలి. ఏ అవసరం వచ్చినా ఏటూరునాగారం పోవాలి అంటే నడుచుకుంటూ పోవడం తప్పా వేరే మార్గం లేదు. – రాము, మల్యాల

దారి ఇలా.. వెళ్లేదెలా?

దారి ఇలా.. వెళ్లేదెలా?

దారి ఇలా.. వెళ్లేదెలా?