
సాయిబాబా ఆలయంలో చోరీ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి హుండీని బయటకు ఎత్తుకెళ్లి పగులగొట్టి సొత్తును ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై రాజ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. సీసీ పుటేజీలను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఓపెన్ స్కూల్
అడ్మిషన్లు ప్రారంభం
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ జీవీవీ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేయాలనుకునే నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతిలో అడ్మిషన్ పొందాలనుకునే వారు టీసీ, స్టడీ, కులం సర్టిఫికెట్‌తో పాటు ఆధార్ కార్డు, పాస్‌ఫొటో తీసుకుని రావాలని కోరారు. ఇంటర్మీడియట్‌లో చేరేందుకు టెన్త్ మెమో, స్టడీ, కులం, ఆధార్, టీసీతో పాటు పాస్‌ఫొటోలతో రావాలని కోరారు.
పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
ములుగు రూరల్: ఎస్‌ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని కాటాపురంలో పట్టాలిచ్చిన నిరు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్ బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 2023లో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 108 మందికి ఇళ్ల పట్టాలను అందించిందని తెలిపారు. ఒక్కొక్కరికి 75 గజాల ఇంటి స్థలానికి పట్టాలు అందించారని వివరించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ ఇంటి స్థలాలు కేటాయించలేదని పేర్కొన్నారు. మంత్రి సీతక్క, కలెక్టర్ చొరవ తీసుకుని పట్టాలిచ్చిన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
టెక్నాలజీ నైపుణ్యాలు
పెంచుకోవాలి
వెంకటాపురం(కె): రానున్న కాలంలో టెక్నాలజీకి అనుగుణంగా ఫొటోగ్రఫీలో ఫొటో గ్రాఫర్స్ తమ నైపుణ్యాలను పెంచుకోవాలని ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పాలెంవాగు ప్రాజెక్టు సమీపంలో మండల ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ భరోసా పథకంలో ప్రతిఒక్కరూ చేరి వాటి ఫలాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఫొటో గ్రాఫర్స్ అధ్యక్షులు లింమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ సునీల్, వెంకటాపురం, వాజేడు మండలాల అధ్యక్షులు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.