
పల్లెల్లో పడకేసిన ప్రత్యేక పాలన
ఏటూరునాగారంలో రోడ్డు పక్కన పడేసిన చెత్త
కనిపించని
ప్రత్యేకాధికారులు
జిల్లా వ్యాప్తంగా 10 మండలాల పరిధిలో 174 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇటీవల ములుగు మున్సిపాలిటీలో మూడు పంచాయతీలు విలీనం కావడంతో పంచాయతీల సంఖ్య 171కి చేరింది. 2024 ఫిబ్రవరి 1న పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసింది. దీంతో మరుసటి రోజున ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. మండలానికి జిల్లా స్థాయి అధికారి, గ్రామాలకు సీనియర్ అసిస్టెంట్ నుంచి పైస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించడంతో వారు బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీల్లో ప్రత్యేక పాలన సుమారుగా 18 నెలలుగా కొనసాగుతున్నప్పటికీ ప్రత్యేకాధికారులు పంచాయతీలకు వచ్చి విధులు నిర్వహించిన దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమం ఉన్నప్పుడు తప్పా ఇతర రోజుల్లో పంచాయతీ విధులకు హాజరుకావడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
వెంకటాపురం(ఎం): పంచాయతీల్లో ప్రత్యేక పాలన పడకేసింది. జీపీల్లో విధులు నిర్వర్తించాల్సిన ప్రత్యేకాధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో గ్రామాలాభివృద్ధి, ప్రజల సంక్షేమం గాలిలో దీపంలా మారి పల్లెలన్నీ మసకబారిపోతున్నాయి. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన వెంటనే గ్రామాల్లో పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరవేస్తూ, గ్రామాల్లో సమస్యలు పరిష్కారించాల్సిన ప్రత్యేకాధికారులు జీపీలను పట్టించుకోకపోవడంతో పంచాయతీ కార్యదర్శులే అన్నీ తామై గ్రామ పంచాయతీలను నెట్టుకొస్తున్నారు.
కనిపించని అభివృద్ధి
పంచాయతీల పాలకవర్గం గడువు ముగియడంతో ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరు లేకపోవడంతో గ్రామాలాభివృద్ధి కుంటుపడుతోంది. గత పాలకవర్గాలు చేసిన పనులకే ఇప్పటి వరకు బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు లబోదిబోమంటున్నారు. ఒక్కొక్క గ్రామపంచాయతీకి సుమారు రూ.2 లక్షల నుంచి 20 లక్షలకు పైగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లాలోని 174 గ్రామపంచాయతీలకు సుమారుగా రూ.20 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు మాజీ సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. 2023 సెప్టెంబర్ నుంచి చేసిన పనులకు బిల్లులు రాలేదని వారు వాపోతున్నారు. అంతేకాకుండా ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులు సైతం అప్పులు చేసి గ్రామాల నిర్వహణ కొనసాగిస్తున్నారు. తాగునీటి పైపులైన్ లీకేజీలకు మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య పనుల నిర్వహణ, గ్రామాల్లోని చెత్తను ట్రాక్టర్‌ల ద్వారా డంపింగ్‌కు చేరవేయడం లాంటి పనుల కోసం పంచాయతీ కార్యదర్శులు సొంతంగా ఖర్చు చేస్తున్నారు. ఖర్చు చేసిన డబ్బులకు బిల్లులు పెట్టి ఎస్‌టీఓలకు చెక్కులు పంపుతున్నప్పటికీ చెక్కులు పాస్ కావడం లేదని కొంతమంది కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకాధికారుల పాలనలో లక్షలు వెచ్చించి గ్రామాల నిర్వహణ కొనసాగిస్తుండడంతో పాటు విధుల నిర్వహణ భారంగా మారిందని వాపోతున్నారు. నెలసరి వచ్చే వేతనం కూడా పంచాయతీ అభివృద్ధికే ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి నెలకొందని కార్యదర్శులు పేర్కొంటున్నారు.
పంచాయతీల వైపు కన్నెత్తి చూడని ప్రత్యేకాధికారులు
పంచాయతీ కార్యదర్శులే
నెట్టుకొస్తున్న వైనం
నిధుల్లేక కుంటుపడుతున్న
గ్రామాల అభివృద్ధి

పల్లెల్లో పడకేసిన ప్రత్యేక పాలన

పల్లెల్లో పడకేసిన ప్రత్యేక పాలన

పల్లెల్లో పడకేసిన ప్రత్యేక పాలన