
ఉపాధ్యాయులు లేక కుంటుపడుతున్న విద్య
ఏటూరునాగారం: వాజేడు, వెంకటాపురం మండలాల్లోని ప్రభుత్వ, గిరిజన విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు లేక విద్య కుంటుపడుతుందని, వెంటనే ఖాళీగా ఉన్న చోట ఉపాధ్యాయులను నియమించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నర్సింహామూర్తి అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రెండు మండలాలను ములుగు జిల్లాలో కలపడం వల్లనే విద్యావ్యవస్థ కుంటుపడుతోందని తెలిపారు. ఏజెన్సీలోని చిరుతపల్లి –2 ఆశ్రమ పాఠశాలలో పలు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. జీపీఎస్ చిరుతపల్లిలో 54 మంది, బోదాపూర్‌లో 55మంది విద్యార్థులు ఉంటే ఒక్కొక్కరే ఉపాధ్యాయులు ఉన్నారని వివరించారు. అలాగే కలిపాక, ముత్తారం పాఠశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులు లేరని, వాజేడు మండలంలోని పెద్ద గొల్లగూడెం ఆశ్రమ పాఠశాల, జంగాలపల్లి, కాసారం పాఠశాలల్లో ఏకో ఉపాధ్యాయులతో పాఠశాలలను నడుపుతున్నట్లు పీఓకు వివరించామన్నారు.
గుడిసెవాసులకు హక్కు పత్రాలివ్వాలి
జీఓ నంబర్ 49ని రద్దు చేసి, గుడిసెవాసులకు హక్కుపత్రాలివ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు జజ్జరి దామోదర్, జిల్లా అధ్యక్షుడు దుర్గి చిరంజీవి అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.