ప్రజావాణిలో 85, గిరిజన దర్బార్‌లో 36 ఫిర్యాదులు
కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అర్జీల స్వీకరణ
సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌కు వినతులు వెల్లువలా వచ్చాయి. ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 121అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావులతో కలిసి 85 దరఖాస్తులు స్వీకరించగా ఐటీడీఏలో పీఓ చిత్రామిశ్రా 36 వినతులు స్వీకరించారు. వినతులను పరిశీలించిన అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సమస్య పరిష్కరించిన దరఖాస్తుదాడుడికి ఫోన్ సమాచారం అందించాలని సూచించారు.
గిరిజన దర్బార్‌లో వినతులు ఇలా..
మంగపేట మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలకు సీసీ రోడ్డు మంజూరు చేయాలని గిరిజనులు విన్నవించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఆకులవారిఘణపురంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని గిరిజనులు వేడుకున్నారు. మహబూబాబాద్ మండలం మిర్యాలపేట గ్రామానికి చెందిన పలువురు రైతులు రైతుభరోసా తమ ఖాతాల్లో పడడం లేదని, పడే విధంగా చేయాలని పీఓను వేడుకున్నారు. ఏటూరునాగారం మండలంలోని చింతలమోరి గొత్తికోయగూడెంలో చిన్న పిల్ల లు చదువుకునేందుకు ఒక రేకుల షెడ్డు ఏర్పాటు చేయాలని గిరిజనులు పీఓను వేడుకున్నారు.
గోవిందరావుపేట మండలం ప్రాజెక్టు నగర్‌లోని గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని విన్నవించారు. భూపాలపల్లి మండలం వెలిశాలపల్లిలో పీఎంహెచ్ హాస్టల్‌లో ఏఎన్‌ఎంగా నియమించాలని కోరారు. గంగారంలో రెవెన్యూ అసైన్డ్ భూములకు పట్టాలు చేయాలని గిరిజనులు పీఓను వేడుకున్నారు. మంగపేట మండలం పేరుకులకుంట గిరిజన సంక్షేమశాఖలో అటెండర్ ఉద్యోగం ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. తొండ్యాల గ్రామానికి చెందిన గిరిజనులు 49వ జీఓను రద్దు చేయాలని పీఓకు వినతిపత్రాన్ని సమర్పించారు.
పింఛన్ అందించి ఆదుకోవాలి..
నా కుమారుడు డేవిడ్ పట్టుకతోనే దివ్యాంగుడు. ప్రస్తుతం 6 సంవత్సరాలుగా మంచానికి పరిమితమై ఉంటున్నాడు. తాము నిరుపేద కుటుంబానికి చెందినా.. సాధ్యమైనంత వరకు ఆస్పత్రుల్లో డబ్బులు ఖర్చు చేసి చికిత్స చేయించాం. అయినా ఫలితం లేకుండా పోయింది. ఉన్నతాధికారులు దయతలిచి నా కుమారుడికి పింఛన్ అందించి ఆదుకోవాలి.
– అర్షం రజిత, మల్లూరు, మంగపేట
భూ సమస్యలు 39
గృహ నిర్మాణం 16
ఉపాధి కల్పన 03
పింఛన్లు 06
ఇతర సమస్యలు 21

ప్రజావాణి దరఖాస్తుల వివరాలు