రుణమాఫీ ఫ్లెక్సీల ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

రుణమాఫీ ఫ్లెక్సీల ఏర్పాటు

Jun 27 2025 12:33 PM | Updated on Jun 27 2025 12:33 PM

రుణమాఫీ ఫ్లెక్సీల ఏర్పాటు

రుణమాఫీ ఫ్లెక్సీల ఏర్పాటు

ములుగు రూరల్‌: జిల్లాలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం రుణమాఫీ నిధులను జమ చేసిందని, ఈమేరకు గురువారం పంచాయతీ కార్యాలయంలో రైతు రుణమాఫీ ఫ్లెక్సీలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఏఓ సురేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 26,454 మంది రైతులకు రూ.219 కోట్ల నిధులను జమ చేసినట్లు వివరించారు. లబ్ధిదారుల వివరాలను ఆయా పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు.

108 అంబులెన్స్‌ తనిఖీ

వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో గురువారం 108 అంబులెన్స్‌ హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆడిటింగ్‌ అధికారి కిశోర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన 108కు చెందిన రికార్డులు, మందులు, మెడికల్‌ ఇండెంట్‌ స్టాక్‌ వివరాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ రాజ్యలక్ష్మి, పైలెట్‌ రాధస్వామి తదితరులు ఉన్నారు.

క్రెచ్‌ సెంటర్లపై

స్పష్టత ఇవ్వాలని వినతి

ములుగు రూరల్‌: క్రెచ్‌ సెంటర్లపై స్పస్టత ఇవ్వాలని, నిర్వహణ బాధ్యత అంగన్‌ వాడీ టీచర్లకు ఇవ్వాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు గురువారం వినతిపత్రం అందజేశారు. అంగన్‌వాడీ సెంటర్లకు, టీచర్లకు ఏ విధమైన ఇబ్బందులు ఉండవని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీ టీచర్లు ఐదేళ్లలోపు పిల్లలకు ఫ్రీ స్కూల్‌ చెబుతున్నారని తెలిపారు. అలాగే అంగన్‌వాడీ సెంటర్లలో మూడేళ్ల లోపు పల్లిలకు ఆలనాపాలనా పేరుతో క్రచ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వీటి ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మక్క, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, అలివేలు తదితరులు పాల్గొన్నారు.

పంటరుణాలు

ఇవ్వకపోవడం సరికాదు

మంగపేట: మండల పరిధిలోని గిరిజన రైతులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలపై పంట రుణాలు ఇవ్వకుండా బ్యాంకర్లు ఇబ్బందులకు గురిచేయడం సరికాదని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పూనెం నగేశ్‌ ఆరోపించారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సంఘం అత్యవసర సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మండల పరిధిలోని కమలాపురం ఎస్‌బీఐ, మంగపేట యూనియన్‌ బ్యాంక్‌, మల్లూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌, రాజుపేటలోని కెనరాబ్యాంక్‌ పరిధిలో గల గిరిజన రైతులు పంట రుణాల కోసం బ్యాంకులకు వెళ్తే ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలపై పంటరుణాలు ఇచ్చే విషయంలో ఉన్నతాధికారుల నుంచి తమకు ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతూ బ్యాంకు అధికారులు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో పంటల సాగు పెట్టుబడికి బ్యాంకుల్లో రుణాలు లభించక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తప్పని పరిస్థితుల్లో కొందరు నిరుపేద గిరిజన రైతులు ఇప్పటికే వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్‌ స్పందించి బ్యాంకు అధికారులతో మాట్లాడి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలపై రుణాలు ఇచ్చే విదంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేని పక్షంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో పంట రుణాలు ఇచ్చేంత వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆసంఘం మండల నాయకులు కుర్సం చిరంజీవి, కోరం అంజయ్య, మద్దెల సమ్మయ్య, కుర్సం సంతోష్‌, మాడవి విజయ్‌కుమార్‌, బసవయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement