సర్కారు బడి రమ్మంటోంది..
వెంకటాపురం(ఎం): సర్కారు బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మరింతగా చర్యలు చేపడుతుంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని కూడా నిర్వహిస్తుండడంతో సర్కారు బడుల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు విద్యాశాఖ అధికారులు కృషిచేస్తున్నారు. బడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేందుకు ప్రభుత్వం ఈనెల 19వరకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంది. ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై అవగాహన కల్పించడమే కాకుండా బడీడు పిల్లలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. రెండు రోజులుగా ఉపాధ్యాయులు బడిబాట ర్యాలీలు, ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 1,754మంది బడీడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించారు. ఈసారి విద్యార్థుల సంఖ్య మరింతగా పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు
జిల్లాలోని 10 మండలాల పరిధిలో 510 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 27,514 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ పాఠశాల పునప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 27,514మంది విద్యార్థులకు 1,61,130 పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా 1,49,070 పాఠ్య పుస్తకాలు జిల్లాకేంద్రానికి చేరుకున్నాయి. జిల్లా కేంద్రానికి వచ్చిన పాఠ్యపుస్తకాలను ఎంఆర్‌సీల ద్వారా ఆయా పాఠశాలలకు సరఫరా చేశారు. మరో 12,060 పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉంది. పాఠశాల ప్రారంభం రోజున పుస్తకాలతో పాటు యునిఫాంలు, నోట్ పుస్తకాలు కూడా పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
12న పాఠ్యపుస్తకాలు అందజేస్తాం..
జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేస్తాం. ఇప్పటికే ఎమ్మార్సీల ద్వారా ఆయా పాఠశాలలకు కావాల్సిన పుస్తకాలను సరఫరా చేశాం. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రారంభమైన మొదటిరోజే విద్యార్థులకు పుస్తకాలు పంపీణీ చేయాలని సూచించాం. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసే నోట్ పుస్తకాలు కూడ ఎమ్మార్సీల ద్వారా పాఠశాలలకు సరఫరా చేశాం. – అప్పని జయదేవ్,
జిల్లా మేనేజర్ పాఠ్యపుస్తకాలు
ఉపాధ్యాయుల ఇంటింటి ప్రచారం
పాఠశాల తొలిరోజే పాఠ్యపుస్తకాల పంపిణీకి చర్యలు
జిల్లాలో 510 పాఠశాలల్లో 27,514మంది విద్యార్థులు
సర్కారు బడి రమ్మంటోంది..


