పంచాయతీ పట్టని ఓటర్లు!
ఓటుకు దూరంగా 2.93 లక్షల మంది
ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీలు : 1,682
● 21.17 లక్షల మందికి ఓటేసింది 18.25 లక్షల మంది
● 87 శాతానికే పరిమితమైన ఓట్లు.. మూడు విడతల్లోనూ ఇదే పరిస్థితి
● పోలింగ్ శాతం తగ్గడంపై సర్వత్రా చర్చ.. ఇదే అంశంపై ఉన్నతాధికారుల ఆరా
ఓటేయని వారి శాతం : 13.82
పోలింగ్ శాతం : 86.18
2,92,638
21,17,188
18,24,580
మొత్తం ఓటర్లు
పోలైన ఓట్లు
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన మేర పోలింగ్ శాతం నమోదు కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 89 నుంచి 94 శాతం వరకు పోలింగ్ నమోదవుతుందని అధికారులు సైతం భావించారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత కూడా ఓటు నమోదుకు అవకాశం కల్పించడంతోపాటు.. ఓటు సద్వినియోగంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ మూడు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 21,17,188 మంది ఓటర్లు ఉండగా 18,24,580 (86.18 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జనగామలో ఎక్కువగా నమోదు..
ఉమ్మడి వరంగల్‌లో మూడు విడతల్లో ఓటు శాతం 87.07 దాటలేదు. 2,92,608 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. జనగామలో ఓటింగ్ ఎక్కువగా నమోదైంది. మొదటి విడతలో అత్యధికంగా జనగామ జిల్లాలో 87.39 శాతం, రెండో విడతలో 88.52 శాతం కాగా, మూడో విడతలో 88.48 శాతంగా నమోదైంది. మూడో విడతలో మహబూబాబాద్‌లో 88.52 శాతం ఓట్లు పోలయ్యాయి. మండలాల వారీగా చూస్తే కూడా 8 మండలాలు మినహా ఏ మండలంలోనూ 90 శాతాన్ని మించి ఓటుహక్కు వినియోగించుకోలేదు. 1,682 గ్రామ పంచాయతీల పరిధిలో 21,17,580 మంది ఓటర్లకు 18,24,580 మంది (86.18 శాతం) ఓట్లు వేయగా.. 2,92,638 (13.82 శాతం) మంది ఓటుకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
ఓట్ల శాతం ఎందుకు తగ్గినట్లు..?
పోలింగ్ శాతం తగ్గడంపై ఆయా జిల్లాల ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఉమ్మడి వరంగల్ కాకుండా.. మిగతా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో మరిన్ని ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున.. ఓటింగ్ శాతం తగ్గడానికి కారణాలను విశ్లేషించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాల ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు పోలింగ్ బూత్‌స్థాయి అధికారులు (పీబీఎల్‌ఓలు) డివిజన్, జోనల్ ఇన్‌చార్జ్‌లు, రూట్ ఆఫీసర్ల వరకు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నారు. ఓట్ల శాతం తగ్గడానికి కారణాలను విశ్లేషిస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారితో పాటు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి పేర్లను కొన్ని తొలగించలేదని ప్రాథమికంగా గమనించినట్లు చెబుతున్నారు. మృతుల పేర్లు జాబితాలో కొనసాగడంతోపాటు స్థానికేతరుల పేర్లను తొలగించకపోవడం వల్ల పోలింగ్ శాతంగా తగ్గినట్లు భావిస్తున్నామని, వాటన్నింటిపై కసరత్తు చేస్తున్నామని ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇదిలా ఉండగా.. ఏయే జిల్లాలో పోలింగ్ శాతం తగ్గింది.. అందుకు కారణాలు ఏమిటన్న విషయాలతో పాటు తక్షణమే తొలగించాల్సిన ఓటర్ల జాబితాను కూడా ఈ మేరకు జిల్లాల వారీగా సిద్ధం చేసి ఎన్నికల సంఘానికి పంపేందుకు ఓ నివేదికను అధికారులు రూపొందిస్తున్నట్లు సమాచారం.
పంచాయతీ పట్టని ఓటర్లు!


