కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు
ములుగు: జిల్లా వ్యాప్తంగా మూడు దశల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు ఈనెల 17తో పూర్తయ్యా యి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త పాలక వర్గాలు కొలువు దీరడానికి సిద్ధమవుతున్నాయి. నేడు (సోమవారం) సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో మొత్తం 146 పంచాయతీలు ఉండగా, ఈ నెల 11న మొదటి విడతలో 48 పంచాయతీలకు, 14న రెండో విడతతో 52 పంచాయతీలకు, 17న మూడో విడత 46 పంచాయితీలకు ఎన్నికలు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 146 గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.
నేడు మొదటి సమావేశం
నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన తొలి సమావేశంలో నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి వీరితో నిబంధనల ప్రకారం ప్రమాణం చేయించిన అనంతరం ప్రమాణ పత్రంపై సంతకాలు చేసి అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం సర్పంచ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో గ్రామాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
ప్రత్యేక అధికారుల పాలనకు తెర
23 నెలలుగా గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పాలన లేకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సైతం నిలిచిపోయాయి. సుమారు రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాలు ఏర్పాటు చేయడంలో ప్రత్యేక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనుండడంతో గ్రామాల్లో పంచాయతీలకు కొత్త కళ సంతరించుకోనుంది.
నేడు సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం
బాధ్యతలు చేపట్టనున్న 146 మంది సర్పంచ్‌లు
ఏర్పాట్లు చేసిన పంచాయతీ అధికారులు


