
ధాన్యం దిగుమతి చేసుకోం..
గోవిందరావుపేట: ధాన్యం దిగుమతి చేసుకోలేము.. నూకశాతం ఎక్కువగా వస్తుందంటూ ఓ రైస్‌మిల్లు యజమాని ధాన్యం లారీలను వాపస్ పంపించారు. ఈ ఘటన చల్వాయిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని చల్వాయిలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం నుంచి మూడు ధాన్యం లారీలను అదే గ్రామంలో ఉన్న మహాలక్ష్మీ రైస్‌మిల్లుకు పంపించారు. సరుకు చూసిన మిల్లు యజమాని ధాన్యం కటింగ్ ఎక్కువగా అవుతుంది.. దిగుమతి చేసుకోం అంటూ సంబంధిత రైతులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో రైతులు కలెక్టర్‌కు తెలిసిన నాయకులతో ఫోన్ చేయించగా సివిల్ సప్లయీస్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. మిల్లు యజమానితో మాట్లాడినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ లారీలను జిల్లాలోని వేరే మిల్లులకు దిగుమతి కోసం పంపించారు.
మాటమార్చిన మిల్లు యజమాని
క్వింటాకు 6 కిలోల కటింగ్ చేసుకుని దిగుమతి చేసుకుంటామని రైతులకు తొలుత చెప్పిన సదరు మిల్లు యజమాని అధికారులు మిల్లుకు చేరుకోగానే మాట మార్చారు. ధాన్యం 40శాతం మాత్రమే రైస్ అవుతుంది. 60శాతం నూక అవుతుంది. 67శాతం రైస్ వస్తేనే దిగుమతి చేసుకుంటామని మాట మార్చి సివిల్ సప్లయీస్ అధికారులకు వెల్లడించారు. ఈ విషయంపై అధికారులు రైస్‌మిల్లు యజమానితో మాట్లాడగా ఒప్పుకోలేదు. దీంతో ఆ అధికారులు వేరే మిల్లులకు తరలించడం విస్మయానికి గురిచేసింది. ధాన్యం కొనుగోళ్ల విషయంపై మంత్రి సీతక్క ఎన్ని సార్లు మిల్లర్లతో మాట్లాడినా మంత్రి మాట కూడా పెడచెవిన పెట్టి వారు ఇష్టానుసారంగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటనేది అర్ధం కాని పరిస్థితి నెలకొంది.
6 కేజీలు తరుగు కింద ఇస్తే..
ఎంతో కష్టపడి ధాన్యం పండించి పంటను మిల్లు దగ్గరికి తీసుకొస్తే క్వింటాకు 6 కిలోల తరుగు తీస్తాం అంటున్నారు. మేము 4 కిలోలకు ఒప్పుకున్నాం.. 6 కిలోలు ఇస్తేనే దిగుమతి చేసుకుంటాం అన్నారు. అధికారులు రాగానే నూక శాతం ఎక్కువగా ఉంది, బాయిల్డ్ మిల్లుకి పంపించండి మాకు రా రైస్ అయితే తీసుకుంటామని మాట మార్చారు. ఇప్పటికే వర్షాలు పడి తీవ్రంగా నష్ట పోయాం. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అధికారులు మిల్లర్ల ఆగడాలను అరికట్టి రైతులకు న్యాయం చేయాలి.
– చాపల నరేందర్ రెడ్డి, రైతు, చల్వాయి
నూక ఎక్కువగా అవుతుందంటూ వాపస్
మహాలక్ష్మీ రైస్‌మిల్లు యజమాని కొర్రీలు
దగ్గరుండి వేరే మిల్లులకు పంపించిన సివిల్ సప్లయీస్ అధికారులు

ధాన్యం దిగుమతి చేసుకోం..

ధాన్యం దిగుమతి చేసుకోం..