వెంకటాపురం(కె): నేడు మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించనున్నట్లు తహసీల్దార్ లక్ష్మిరాజయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలకేంద్రంలో పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయం, పాలెం గ్రామం నుంచి గోదావరి నది వరకు బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేయనున్నట్లు వెల్లడించారు.
అర్ధరాత్రి భారీవర్షం
ములుగు: జిల్లాలోని ములుగు, వెంకటాపురం(ఎం), మంగపేట మండలాల్లో సోమవారం అర్ధరాత్రి అకాల వర్షం కురిసింది. వర్షంతో పాటు గాలి, ఉరుములు, మెరుపులు రావడంతో రైతన్నలు ఆందోళన చెందారు. దీంతో పలుచోట్ల కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. ఉదయాన్నే ధాన్యం రాశులను ఆర బెట్టడానికి రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ములుగు మండలంలో అత్యధికంగా 26.8 ఎంఎం, వెంకటాపురం(ఎం) మండలంలో 7.4 ఎంఎం, మంగపేట మండలంలో 8.4 ఎంఎంల వర్షం కురిసింది.
అంబులెన్స్‌కు దారిచ్చిన రైతులు
వాజేడు: పూసూరు గోదావరి బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం బాండు మొక్కజొన్న సాగుచేసి నష్టపోయిన రైతులు నష్టపరిహారం కోసం రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. అదే సమయంలో ఏటూరునాగారం వైపు నుంచి 108అంబులెన్స్ సైరన్‌తో వచ్చింది. ధర్నా చేస్తున్న రైతులు వెంటనే స్పందించి అంబులెన్స్‌కు దారి ఇవ్వగా అంబులెన్స్ వెళ్లిపోయింది.
కోటగుళ్ల సందర్శన
గణపురం: కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లను పురావస్తు శాఖ సూపరింటెండెంట్ నిఖిల్ దాస్ మంగళవారం సందర్శించారు. త్వరలో ఆలయాన్ని అభివృద్ధి చేయనున్న తరుణంలో అధికారుల బృందం సందర్శించి ఆలయ పరిసరాలను పరిశీలించింది. గర్భాలయం ప్రదక్షిణ పదం, కాటేశ్వరాలయం నాట్యమండపాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన శిలాశాసనం శివ ద్వారపాలక విగ్రహాలను పరిశీలించి ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆర్కియాలజిస్ట్ అసిస్టెంట్ రోహిణి సీనియర్ కన్వర్జేటర్ మల్లేశం ఉన్నారు.
వాటర్ కూలర్లు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సింగరేణి ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన వాటర్ కూలర్‌లను మంగళవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని పెషెంట్లు, వారి బంధువులకు చల్లటి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్ కూలర్లను ఏర్పాటు చేసినట్లు తె లిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీఎంఓ డాక్టర్ పద్మజ, కార్మిక సంఘాల నాయకులు మధుకర్‌రెడ్డి, రమేష్, శేషారత్నం, అధికార ప్రతినిధి మారుతి, డాక్టర్లు పాల్గొన్నారు.
ప్రమాదాల నివారణే లక్ష్యం
భూపాలపల్లి రూరల్: విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యంగా విద్యుత్ భద్రత వారోత్సవాలను ప్రతిఏటా మే1వ తేదీ నుంచి 7వతేదీ వరకు నిర్వహిస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ హెచ్‌ఆర్‌డీ (ఆపరేషన్స్) ఇన్‌చార్జ్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. ఎస్‌ఈ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మధుసూదన్ ముఖ్యఅతిథిగా హాజరై భద్రత వారోత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతి ఉద్యోగి, సిబ్బంది జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎల్‌సీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు సంబంధించి ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.

నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటన