
‘పట్టు’ కోల్పోయింది..!
గోవిందరావుపేట: ఏజెన్సీలోని పట్టు పరిశ్రమ ఒకప్పుడూ సిబ్బందితో కళకళలాడుతూ ఉండేది. మల్బరీ తోట, పట్టు పురుగుల పెంపకం కేంద్రంతో పాటు పట్టు సేకరణతో ఆ ప్రాంతమంతా బిజీబిజీగా ఉండేది. సెరికల్చర్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన విద్యార్థులు శిక్షణ పొందడానికి వివిధ కళాశాలల నుంచి పట్టు పరిశ్రమకు వచ్చేవారు. అయితే ఆ వైభవం నేడు కనుమరుగైంది.. మల్బరీ తోటలో పట్టు పురుగుల పెంపకంతో పాటు దసలి పట్టు తయారీ కేంద్రంగా పేరొందిన పట్టు పరిశ్రమ కొన్నేళ్ల క్రితం మూతపడగా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో గల బస్టాండ్ సమీపంలోని జాతీయ రహదారి పక్కనే పట్టు పురుగుల పెంపకం కేంద్రం ఉంది. అప్పటి ప్రభుత్వం భవనాలతో పాటు పురుగుల పెంపకానికి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించింది. సుమారు 4.30 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలంలో మల్బరీ చెట్ల పెంపకానికి నీటి వసతికి బావి, రెండు బోరు పాయింట్లను ఏర్పాటు చేసింది. చాలా ఏళ్లు పరిశ్రమ బాగా నే నడిచింది. నిత్యం ఐదుగురు కూలీలు పనిచేసేవా రు. ఇద్దరు అధికారుల పర్యవేక్షణలో పట్టు పరిశ్రమ నడిచేది. పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తీసుకురాలేకపోవడంతో పాటు నిధులు, సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపం తదితర కారణాలతో పరిశ్రమ ఎనిమిదేళ్ల క్రితం మూతపడింది.
నిధులు నిలిచిపోవడంతో..
పట్టు పరిశ్రమలో పనిచేస్తున్న వారు కొందరు బదిలీపై వెళ్లడం, ఇంకొందరు పదవీ విరమణ చేయడంతోపాటు నిధులు రాకపోవడంతో పరిశ్రమ మూతపడింది. ఏళ్లు గడుస్తుండడంతో భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో పాటు అందులో ఉన్న పరికరాలు తుప్పుపట్టి పోతున్నాయి. ప్రస్తుతానికి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పట్టు పరిశ్రమ కార్యాలయం స్థలం ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఓ టెక్నికల్ అసిస్టెంట్‌ని నియమించింది.
మద్దిచెట్లు పెంచి దసలి పట్టు తయారీ
అటవీ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా సాగు చేసే దసలి పట్టును సైతం పట్టు పరిశ్రమలో పండించేవారు. అందుకోసం ఈ పరిశ్రమలో మద్దిచెట్లను పెంచారు. గుడ్ల నుంచి పురుగులు బయటకు రాగానే మద్దిచెట్ల పై విడిచి పెట్టేవారు. ఆ పురుగులు ఆ చెట్లపై గుడ్డు ఆకారంలో గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. అలా మారిన గూళ్లను తీసుకొచ్చి లోపల ఉండే పురుగులను నిర్జీవం చేసి రీలింగ్ ద్వారా పట్టు దారం తీసేవారు. దసలి పట్టు వస్త్రాలకు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. పుణ్యక్షేత్రాల్లో ఉపయోగించడం వీటి ప్రత్యేకత.
మూతపడిన మల్బరీ, దసలి పట్టు పరిశ్రమ
శిథిలావస్థకు చేరుకున్న భవనాలు
తుప్పుపట్టిన పరికరాలు

‘పట్టు’ కోల్పోయింది..!

‘పట్టు’ కోల్పోయింది..!

‘పట్టు’ కోల్పోయింది..!