ములుగులోని పరీక్ష కేంద్రానికి చేరుకుంటున్న విద్యార్థులు
ములుగు: పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 3,135 మందికిగాను 3,135 మంది హాజరయ్యారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కేంద్రాల చుట్టూ 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేశారు. జిరాక్స్ సెంటర్లు తెరుచుకోకుండా చర్యలు తీసుకున్నారు.
సెంటర్ తనిఖీ
జిల్లా కేంద్రంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ దివాకర టీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, భద్రత, పరీక్షల నిర్వహణపై ఆరా తీశారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట సీఎస్ వజ్జ తిరుపతి. డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ యాద నాగఝాన్సీ ఉన్నారు.
చూచిరాత.. చిట్టీల అందజేత!
వెంకటాపురం(ఎం): మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం మాస్ కాపీయింగ్‌కు కేంద్రంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. తొలిరోజు పరీక్షకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సెంటర్ల వద్ద మకాం వేసి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు యువత ద్వారా చిట్టీలు చేరవేస్తుండడంతో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు యువతను అడ్డుకొని వారి సెల్‌ఫోన్‌లు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డులు తీసుకొని హెచ్చరించారు. అబ్జెక్టివ్ పేపర్ సమాధానాలు కూడా ఇన్విజిలేటర్లు తరగతి గదులు తిరుగుతూ చెప్పారని, అవన్నీ తప్పులే ఉన్నట్లు విద్యార్థులు ‘సాక్షి’కి వివరించారు.
జిల్లాలో వంద శాతం హాజరైన విద్యార్థులు
మూసివేసిన జిరాక్స్ సెంటర్లు
అవాంఛనీయ ఘటనలు
జరగకుండా పోలీసుల బందోబస్తు
‘పది’ పరీక్షలు షురూ
‘పది’ పరీక్షలు షురూ