ఏటూరునాగారం: పదో తరగతి విద్యార్థులు నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కలెక్టర్ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. మండలకేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల చదువు, వసతులను పరిశీలించారు. ప్రతీ ఒక్కరికి విద్యార్థి దశ కీలకమని సూచించారు. విద్యార్థులకు పాఠాలను బోధించారు. కామన్ డైట్ మెనూ ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. అనంతరం రామన్నగూడెంలోని ఓహెచ్‌ఆర్ ట్యాంకును కలెక్టర్ పరిశీలించారు. తాగునీటి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ముళ్లకట్టలో గ్రామసభ
మండల పరిధిలోని ముళ్లకట్టలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు, పనుల గ్రౌండింగ్ కోసం గ్రామసభను కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పనులు చేపట్టే విధానంపై పలు సూచనలు చేశారు. అలాగే ఐటీఐ కళాశాలకు చేరుకున్న కలెక్టర్ అగ్నిపథ్ కింద భారత సైన్యంలో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావాలని సూచించారు. అలాగే కళాశాల ఆవరణలో కొత్త ట్రేడ్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, నూతన బిల్డింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రాంపతి, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ మోవీన్ కుమార్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రాజ్యలక్ష్మి, కార్యదర్శి రమాదేవి, గ్రామ ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర