వెంకటాపురం(కె): చేతికి వచ్చిన మిర్చి ఏరేందుకు కూలీలు దొరకకపోవడం, కళ్లముందే పంట రాలిపోతుండడంతో ఓ రైతు మనస్తాపానికి గురై మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వెంకటాపురం(కె) మండలం బెస్తగూడెంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెస్తగూడెం గ్రామానికి చెందిన రైతు రామెల్ల సతీష్(39) మూడెకరాల్లో మిర్చి సాగు చేశాడు. మిర్చి ఏరే సమయం రావడంతో కూలీలు దొరకడం లేదు. దీంతో మిర్చి అంతా నేలరాలిపోతున్నది. దీంతో నష్టపోతున్నానని మనస్తాపానికి గురై 15రోజులుగా మద్యం తాగుతూ తిరుగుతున్నాడు. సోమవారం ఉదయం మిర్చి తోట వద్దకు వెళ్లి మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొప్పుల తిరుపతిరావు తెలిపారు.