ములుగు: బాండ్ మొక్కజొన్న సాగుచేసి దిగుబడిరాక నష్టపోయిన రైతులకు ఆయా కంపెనీలు నష్టపరిహారం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో బాండ్ మొక్కజొన్న సాగుచేసి నష్టపోయిన రైతులు, మొక్కజొన్న విత్తన ఉత్పత్తికి సంబంధించిన కంపెనీల రిప్రజెంటేటీవ్స్, ఆర్గనైజర్లు, రైతు ప్రతినిధులు, జిల్లా వ్యవసాయాధికారి సురేష్‌కుమార్‌తో కలిసి ఆర్డీఓ వెంకటేశ్ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కంపెనీలు సింజంట, బేయర్ కంపెనీల ప్రతినిధులు వచ్చిన దిగుబడికి, వ్యత్యాసానికి లెక్కగట్టి మొత్తం నష్టపరిహారం ఇవ్వడానికి సూత్రపాయంగా అంగీకరించారు. రైతు ప్రతినిధులు మాత్రం అదనంగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఐదు రోజుల్లో నిర్ణయం తీసుకుని నష్టపరిహారాన్ని నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యేలా చూస్తామని ఆర్డీఓ తెలిపారు.