నాలో సీమ ఫీలింగ్‌ ఉంది: విజయ్‌ దేవరకొండ | Vijay Deverakonda Ranabaali Movie updates | Sakshi
Sakshi News home page

నాలో సీమ ఫీలింగ్‌ ఉంది: విజయ్‌ దేవరకొండ

Apr 4 2026 3:22 AM | Updated on Apr 4 2026 9:08 AM

Vijay Deverakonda Ranabaali Movie updates

విజయ్‌ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్‌ సమర్పణలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ అనంతపురంలో ముగిసింది. అక్కడి స్థానికులు విజయ్‌–రష్మిక జంట మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపించారని, బైక్‌ ర్యాలీలతో అభిమానులు  విజయ్‌ పట్ల అభిమానం చాటుకున్నారని యూనిట్‌ పేర్కొంది. అలాగే తన రాయలసీమ ఫ్యాన్స్‌ని విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ మీట్‌లో కలిశారు. రాయలసీమకు ఎప్పుడొచ్చినా తన సొంతూరుకి వచ్చినట్లుగా అనిపిస్తోందని, తన లోపల సీమ ఫీలింగ్‌ ఉందని విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు.

రష్మిక... బ్యాక్‌ టు జపాన్‌
వచ్చే నెల జపాన్‌ వెళ్లనున్నారు  రష్మికా మందన్నా. ‘క్రంచీ రోల్‌ అనిమే అవార్డ్స్‌–2026’ టెన్త్‌ ఎడిషన్‌ అవార్డుల ప్రదానోత్సవం మే 23న టోక్యోలో జరగనుంది. ఈ వేడుకకు రష్మికా మందన్నా ఓ ప్రజెంటర్‌గా హాజరు కానున్నారు. అయితే ‘క్రంచీ రోల్‌ అనిమే’ అవార్డు వేడుకలో ఆమె పాల్గొనడం ఇదేం తొలిసారి కాదు. 2024లో ఆమె ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని, ‘బెస్ట్‌ ఆర్ట్‌ డైరెక్షన్‌’ విభాగంలో విజేతకు అవార్డును అందించారు. ఇలా ‘క్రంచీ రోల్‌ అనిమే’ అవార్డ్స్‌ ప్రదానోత్సవంలో ఓ ప్రజెంటర్‌గా పాల్గొన్న తొలి ఇండియన్‌ యాక్టర్‌గా నిలిచారామె. మళ్లీ వచ్చే నెలలో జపాన్‌ వెళ్లనున్నారు. ఇక మొత్తం 32 విభాగాల్లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగుతుంది. తాజాగా నామినేషన్స్‌ను ప్రకటించారు. ఈ క్రమంలోనే అవార్డుల ప్రజెంటర్స్‌ పేర్లను కూడా ప్రకటించారు నిర్వాహకులు. ఈ జాబితాలో రష్మికా మందన్నా పేరు ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement