మలయాళ నటుడు టొవినో థామస్, కయాదు లోహర్ నటిస్తున్న కొత్త చిత్రం 'పల్లి చట్టంబి' వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు డీజో జోస్ ఆంటోనీ తెరకెక్కిస్తున్నారు. రెండురోజుల క్రితం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. సామాజిక మాధ్యమాలలో సినిమాపై బజ్ కూడా క్రియేట్ అయింది. ఇందులో విజయ్ రాఘవన్, సుధీర్, బాబురాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. నౌఫల్, బ్రిజేశ్, సీసీసీ బ్రదర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది.
మాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం.. దుబాయ్‌లో నివసిస్తున్న ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈ చిత్ర నిర్మాతలైన నౌఫల్ అహ్మద్, బ్రిజేష్ మహమ్మద్‌లపై కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను సుమారు రూ. 14 కోట్లకు మోసం చేశారని, ఆ నిధులతోనే ఈ చిత్రాన్ని నిర్మించారని ఆయన ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలు పిటిషన్‌లో భాగంగా మాత్రమే ఉన్నాయి. కానీ కోర్టులో ఇంకా నిరూపించబడలేదు. హైకోర్టు ఈ విషయాన్ని విచారణకు స్వీకరించి, నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. విచారణకు ఆదేశాలు కూడా షెడ్యూల్ చేసింది. అయితే, ఇప్పటివరకు, చిత్ర బృందం నుండి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. ఈ సినిమా 1950, 60ల కాలం నాటి చారిత్రక నేపథ్యంతో రూపొందుతోంది.


