
సూట్‌కేసులు సర్దుకుని మరికొన్ని రోజుల్లో ఫారిన్‌కు మకాం మార్చనున్నారు కొందరు టాలీవుడ్ హీరోలు. వెకేషన్ కోసం అయితే కానే కాదు... సినిమాల చిత్రీకరణ కోసమే. ఈ స్టార్ హీరోల ఫారిన్ షూటింగ్ వివరాలు ఈ విధంగా...
కెన్యా టు హైదరాబాద్
కెన్యా టు హైదరాబాద్ చక్కర్లు కొట్టనుందట ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా టీమ్. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ కెన్యాలో జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్డూడియోలో షూటింగ్ జరుగుతోంది. అయితే కెన్యా షెడ్యూల్ ఇంకా పూర్తి కాలేదట. ఈ సినిమాకి కీలకమైన ఫారెస్ట్ నేపథ్యంలో సాగే సన్నివేశాల చిత్రీకరణ అంతా కెన్యా అడవుల్లో జరిపేలా ప్లాన్ చేశారట రాజమౌళి. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యాక ఈ టీమ్ మళ్లీ కెన్యాకు వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీ 2027లో రిలీజ్ కానుంది.
ఆటా పాటా...
ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. పాటలను అతి త్వరలోనే విదేశాల్లో చిత్రీకరించడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే దర్శకుడు మారుతి గ్రీస్ వెళ్లి, అక్కడి లొకేషన్స్‌ను చూసొచ్చారట. త్వరలోనే ఈ టీమ్ అక్కడికి వెళ్లి రెండు పాటలను, కొంత టాకీ పార్టును షూట్ చేయనుంది. అయితే ఫారిన్ షూటింగ్ షెడ్యూల్‌కు ముందు ‘ది రాజా సాబ్’ టీమ్ కేరళకు వెళుతుందని, అక్కడ ప్రభాస్ పరిచయ పాటను చిత్రీకరిస్తారని సమాచారం. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది.
పది దేశాల్లో డ్రాగన్
డ్రాగన్ విదేశీయానం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కర్ణాటకలో వేసిన ఓ భారీ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదిలా ఉంటే... ఈ సినిమా కథలో ఇంటర్‌నేషనల్ టచ్ ఉంటుందట. దీంతో తర్వాతి షూటింగ్ షెడ్యూల్ కోసం ‘డ్రాగన్’ టీమ్ విదేశాలకు వెళ్లనుందని తెలిసింది. అంతేకాదు... పదికి పైగా దేశాల్లోని లొకేషన్స్‌లో ‘డ్రాగన్’ చిత్రీకరణ జరగనుందని సమాచారం. కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ కానుంది.
ఏడారిలో...
హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ‘ఏఏ22 ఏ6’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో దాదాపు 50 రోజులకు పైగా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. నెక్ట్స్ షెడ్యూల్ అబుదాబిలో జరగనుందని, అతి త్వరలో అక్కడ షూట్ ప్రారంభం కానుందని తెలిసింది. అల్లు అర్జున్ పాల్గొనగా కీలక యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట అట్లీ. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది.
ఇలా షూటింగ్ కోసం త్వరలో విదేశాలు ప్రయాణం కానున్న హీరోలు మరికొందరు ఉన్నారు.