
అధ్యక్షా.. అనే ఒకే ఒక్క డైలాగ్‌తో ఫేమస్ అయిన కమెడియన్ సుమన్ శెట్టి (Suman Shetty). నితిన్ హీరోగా వచ్చిన జయం మూవీతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో తన కామెడీ టైమింగ్తో మెప్పించాడు. అప్పట్లో సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన సుమన్.. ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా కనిపించని సుమన్ శెట్టి.. బిగ్బాస్ రియాలిటీ షోతో మళ్లీ కెరీర్ రీ స్టార్ట్ చేశాడు.
తాజాగా సుమన్ శెట్టి గురించి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తేజ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతన్ని పరిచయం చేశాక.. సినిమాల్లో నీకు మంచి అవకాశాలు వస్తాయి.. తొందరగా నువ్వు ఒక సైట్ కొనుక్కో అని సుమన్కు సలహా ఇచ్చానని అన్నారు. అన్నట్లుగానే సుమన్ శెట్టి ఓ సైట్ కొని ఇల్లు కూడా కట్టుకున్నాడని తెలిపారు. ఒకసారి నా వద్దకు వచ్చిన సుమన్.. ఇదంతా మీవల్లే సార్ అంటూ నా కాళ్లను టచ్ చేస్తా అన్నారు. నేను ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలని అడిగాడని గుర్తు చేసుకున్నారు.
తేజ మాట్లాడుతూ.. 'కాళ్లను టచ్ చేయడం నా కిష్టం లేదని చెప్పా. నేను ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలని అడిగాడు. నేను కొత్త వాళ్లతో సినిమాలు తీస్తా ఉంటా. ఇలా చేస్తూ నేను ఏదో ఒక రోజు రోడ్డుమీదకి వచ్చేస్తా. అప్పుడు నేను ఉండేందుకు నువ్వు కట్టుకునే ఇంటిలో ఒక రూమ్ ఉంచు అని చెప్పా. నేను అన్నట్లుగానే అతని ఇంటిలో నాకోసం రూమ్ కట్టి.. ఆ గదిలో నా ఫోటో పెట్టి రోజు క్లీన్ చేస్తూ ఉంటాడు' అని తెలిపారు.
కాగా.. తేజ డైరెక్షన్లో వచ్చిన జయం, జై, సంబరం, ఔనన్నా కాదన్నా, ధైర్యం, నిజం లాంటి సినిమాల్లో సుమన్ శెట్టికి అవకాశాలిచ్చాడు. అందువల్లే తేజ సార్ నాకు గాడ్ ఫాదర్ అని సుమన్ శెట్టి చాలాసార్లు చెప్పారు. కాగా.. కమెడియన్ సుమన్ శెట్టి.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, భోజ్‌పురి భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించారు.