
వెండితెరపై నటించడమే కాదు.. అందరినీ నవ్వించడం కూడా ఒక కళ. టాలీవుడ్లో కమెడియన్స్ అంటే అందరికీ బ్రహ్మనందం, అలీ, వేణు మాధవ్, సునీల్ లాంటి పేర్లు ఠక్కున గుర్తొస్తాయి. టాలీవుడ్ అభిమానులను కడుపుబ్బా నవ్వించిన వీళ్లంతా ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. మరి వారి లేని లోటు కనిపించకుండా మనల్ని అలరించేందుకు నేటి యువతరం నటులు వెండితెరపై అలరిస్తున్నారు. ఇప్పుడున్న వారిలో హర్ష చెముడు, వెన్నెల కిశోర్, సత్య లాంటి వాళ్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. వీళ్లంతా తమ కామెడీ టైమింగ్తో మనల్ని నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు.
వీరితో పాటు ప్రస్తుత తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో వ్యక్తి రచ్చ రవి. జబర్దస్త్ నుంచి మొదలై టాలీవుడ్ సినిమాల్లో తన కామెడీ టైమింగ్తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. బలగం సినిమాలో 'ఆగుతావా రెండు నిమిషాలు' అంటూ తెగ నవ్వించేశారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడిగా, కమెడియన్ మనల్ని అలరిస్తోన్న రచ్చ రవి తాజాగా తన ఇన్స్టాలో ఫోటోలను షేర్ చేశారు. ఇండస్ట్రీలో వచ్చేందుకు అవకాశాల వేటలో పరుగులు తీయడానికి తీసుకున్న మొదటి ఆల్బమ్లోని ఫోటోలు పంచుకున్నారు.
రచ్చ రవి తన ఇన్స్టాలో రాస్తూ..'తన సినీ ప్రయాణానికి అవకాశాల వేటలో పరుగులు తీయడానికి మొదటి ఆల్బమ్ చేయించుకున్న రోజులవి... చలో కృష్ణ నగర్. ఇంద్రనగర్.. ఫిలింనగర్.. అని ఇద్దరు మిత్రులతో హైదరాబాద్ బయలుదేరా... ఎందుకో రాత్రి గుర్తొచ్చింది కాక మీతో చెప్పుకుందామని.. నా సినీ ప్రయాణం వన్స్ మోర్ ప్లీజ్..... అబ్బబ్బ ప్లీజ్ వన్స్ మోర్ అంటూ.... మనందరికీ ఇష్టమైన వేణుమాధవ్ అన్న షో ద్వారా షురూ అయింది... ఒకసారి రాత్రి గుర్తు చేసుకున్న మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నా... ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క అవకాశం ఒక గొప్ప అనుభవం... మీ అందరి ఆశీస్సులు 140 చిత్రాలు..... ఈ అవకాశం ఇచ్చిన సినీ రంగా పెద్దలకు, గురువులకు ప్రేక్షక దేవుళ్లకు శతకోటి వందనాలు.' అంటూ పోస్ట్ చేశారు.