'ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి నిరూపించుకున్నారు.. త్వరలోనే గుడ్‌న్యూస్‌'

Tollywood Celebreties Press Meet After Meeting With AP CM Ys Jagan - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తో సినీ ప్రముఖులు భేటీ విజయవంతంగా ముగిసింది. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సినీ ప్రముఖులు మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ సమస్యలకు శుభంకార్డు పడిందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని సీఎం జగన్‌ తీసుకున్నారని, ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

'విశాఖను సినిమా హబ్‌గా తయారు చేస్తామని సీఎం జగన్‌ అన్నారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ ఎలా అయితే అభివృద్ధి చెందిందో ఏపీలో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడతాం అని సీఎం జగన్‌ అన్నారు. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలకు మంచి ఆదరణ వస్తోంది. ఏ సమస్య వచ్చినా సామరస్యంగా పరిష్కరించుకుంటాం. ఈనెల చివర్లో జీవో వచ్చే అవకాశం ఉంది. సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రత్యేక శ్రద్ద వహించిన సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ పేర్ని నానికి ధన్యవాదాలు' అని మెగాస్టార్‌ చిరంజీవి పేర్కొన్నారు. 

చిరంజీవి గారు దారి చూపించారు
'గత ఆరు, ఏడు నెలలుగా సినీ పరిశ్రమ సందిగ్ధంలో పడిపోయింది. అలాంటి సమయంలో చిరంజీవి గారు ముందడుగు వేసి మాకు దారి చూపించారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు. ఈరోజు జరిగిన సమావేశం చాలా పెద్ద రిలీఫ్‌ అని చెప్పొచ్చు. వారం, పది రోజుల్లో గుడ్‌న్యూస్‌ వింటాం. సమస్య పరిష్కారానికి కృషి చేసిన సీఎం జగన్‌కు, మంత్రి పేర్ని నానికి ప్రత్యేక ధన్యవాదాలు' అని సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు అన్నారు. 

 

ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి నిరూపించుకున్నారు
'ముందుగా సీఎం జగన్‌కి ధన్యవాదాలు. అందరి అభిప్రాయాలు ఎంతో ఓపిగ్గా విన్నారు. ఇక గత కొన్నాళ్లుగా సందిగ్ధంలో ఉన్న సమయంలో పరిష్కారం దిశగా చిరంజీవి దాన్ని ముందుకు తీసుకుళ్లారు. ఆయనకు ఇష్టం ఉండదు కానీ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని వినియోగించి ఇంత పెద్ద సమస్య పరిష్కారమయ్యేలా కృషి​ చేశారు' అని డైరెక్టర్‌ రాజమౌళి అన్నారు. 

‘సీఎం జగన్‌ గారు మా పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. అందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ  విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న చిరంజీవికి ధన్యవాదాలు’ అని ప్రభాస్‌ పేర్కొన్నారు.

‘చిన్న సినిమాలకు థియేటర్ దొరికే పరిస్థితి లేదు. అలాంటి సగటు సినిమాను బతికించాల్సిందిగా సీఎం గారిని కోరాము. ఎటువంటి సాయం కావాలన్నా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు’ అని ఆర్‌ నారాయణమూర్తి అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top