
సుకుమార్... పాన్ ఇండియా స్థాయిలో పరిచయం అక్కర్లేని దర్శకుడి పేరు. ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ద్వారా క్రేజీ పాన్ ఇండియా చిత్రాలతో పాటు కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలను అందించడంలోనూ సుకుమార్ ముందంజలో ఉన్నారు. ఆయన ఆరంభించిన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పది వసంతాలు పూర్తి చేసుకుంది. ‘కుమారి 21ఎఫ్, ఉప్పెన, విరూ పాక్ష, 18 పేజెస్, పుష్ప–2, గాంధీ తాత చెట్టు’ వంటి పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలు అగ్ర నిర్మాణ సంస్థల నిర్మాణ భాగస్వామ్యంలో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై రూపొందాయి.
తాజాగా సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అలాగే నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలోనూ సుకుమార్ రైటింగ్స్ భాగస్వామంగా ఉంది. ‘పెద్ది’ అనంతరం సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందనున్న చిత్రానికీ సుకుమార్ రైటింగ్ నిర్మాణ భాగస్వామ్యంగా ఉంది. అంతేకాదు... ఈ బ్యానర్‌లో మరో ఆరు కథలతో సినిమాలు రూపొందడానికి సిద్ధంగా ఉన్నాయి.