శ్రీరామ్‌ 'నిశ్శబ్ద ప్రేమ' మూవీ రివ్యూ | Sriram Nishabda Prema Telugu Movie Review And Rating | Sakshi
Sakshi News home page

శ్రీరామ్‌ 'నిశ్శబ్ద ప్రేమ' మూవీ రివ్యూ

May 24 2025 6:19 PM | Updated on May 24 2025 6:57 PM

Sriram Nishabda Prema Telugu Movie Review And Rating

టైటిల్‌ : నిశ్శబ్ద ప్రేమ
నటీనటులు: శ్రీరామ్, ప్రియాంక తిమ్మేష్, హరీశ్ పెరడి, వియాన్, నిహారిక పాత్రో తదితరులు
నిర్మాణ సంస్థ:  సెలెబ్రైట్ ప్రొడక్షన్స్
నిర్మాత: కార్తికేయన్. ఎస్
ఎడిటింగ్:  మదన్.జి
దర్శకత్వం, కథ:  రాజ్ దేవ్
సంగీతం:  జుబిన్
సినిమాటోగ్రఫీ: యువరాజ్.ఎం
విడుదల: మే 23, 2025

హీరో శ్రీరామ్‌ చాలా ఏళ్ల తర్వాత వెండితెరపై కనిపించారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా దగ్గరైన శ్రీరామ్‌ హీరోగానే కాకుండా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పించారు. తాజాగా ఓ డిఫ‌రెంట్ ల‌వ్‌స్టోరీతో 'నిశ్శబ్ద ప్రేమ' అంటూ తన కొత్త సినిమాను విడుదల చేశారు. ఇందులో ప్రియాంక తిమ్మేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. కార్తికేయన్ ఎస్ నిర్మించిన ఈ మూవీకి రాజ్ దేవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ మే 23న విడుదలైంది. కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌న‌టువంటి ఓ విభిన్న‌మైన క్యారెక్ట‌ర్‌లో శ్రీరామ్ క‌నిపించాడు.  భార్య మ‌ర‌ణానికి కార‌ణ‌మైన వారిపై ఓ యువ‌కుడు ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడు..? అనే అంశాన్ని చాలా థ్రిల్లింగ్‌గా దర్శకుడు చూపారు.

కథేంటంటే..
సంధ్య (ప్రియాంక తిమ్మేష్)ను వాళ్లింట్లోనే గుర్తుతెలియని వ్యక్తి చంపే ప్రయత్నం చేస్తాడు. దీంతో భయంతో ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. రోడ్డు వెంట పరుగెడుతుండగా యాక్సిండెంట్‌ కావడంతో తలకు తీవ్రమైన గాయం అవుతుంది. దీంతో ఆమె తన గతాన్ని మరిచిపోతుంది.
తనని హాస్పిటల్‌లో చేర్చిన రఘు ఎవరో కాదు తన భర్తే అనేలా పరిచయం చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లి యోగ క్షేమాలు చూస్తుంటాడు. ఆ సమయంలో కనిపించిన పాత డైరీని చూసిన సంధ్య.. అతను రఘు కాదని, విఘ్నేష్ (శ్రీరామ్) అని తెలుసుకుంటుంది. ఈలోపు తన భార్య సంధ్య కనిపించడం లేదంటూ రఘు (వియాన్) పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. విచారణ మొదలెట్టిన కమీషనర్ అడ్వర్డ్ (హరీశ్ పెరడి)కు యునానిమస్ కిల్లర్ దగ్గర సంధ్య ఉందని తెలుస్తోంది. అసలు సంధ్యను విఘ్నేష్ ఎందుకు తన ఇంటికి తీసుకెళ్లాడు? సంధ్య ఎలా అతని నుంచి తప్పించుకుంది? అసలు విఘ్నేష్ ఎవరు? రఘు ఎవరు? వీరిద్దరికి, సంధ్యకి ఉన్న సంబంధం ఏమిటి? మధ్యలో రఘు పర్సనల్ సెక్రటరీ అయిన షీలా (నిహారిక పాత్రో) పాత్రేమిటి? అసలు సంధ్యని చంపాలనుకున్నది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే ‘నిశ్శబ్ద ప్రేమ’ మూవీ.

ఎలా ఉందంటే..
సినిమాలోని పాత్రలను పరిచయం చేయడం కోసం టైమ్ తీసుకోకుండా దర్శకుడు చాలామంచి పనిచేశాడు. ప్రేక్షకులను డైరెక్ట్‌గా కథలోకి తీసుకెళ్లిన విధానం బాగుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. సగం సినిమా అయ్యే సమయానికి, అసలు సంధ్యని చంపాలనుకున్నది ఎవరు..? అనేది ఓ క్లారిటీ వస్తుంది కానీ, అతను ఎలా బయటకు వస్తాడు..? అతన్ని ఎవరు కనిపెడతారు..? అనేది ఉత్కంఠగా సాగుతుంది. చివరకు ఇచ్చిన ముగింపు కూడా కన్వెన్సింగ్‌గానే ఉంది. శ్రీరామ్ డైలాగ్స్‌తో టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వడంలో కూడా దర్శకుడు సక్సెస్ అయ్యాడు.  ఎక్కడా బోర్ కొట్టకుండా, ట్విస్ట్‌లతో పాటు వాటికి వివరణ ఇచ్చిన విధానం ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూశామనే ఫీల్‌ని ఇస్తుంది.

ఎవరెలా చేశారంటే..
యునానిమస్ కిల్లర్ విఘ్నేష్ పాత్రలో శ్రీరామ్ నటన ఈ సినిమాకు హైలెట్. సీరియస్ ఫేస్‌తో కనిపించడమే కాకుండా, క్రూరంగా హత్యలు చేసే పాత్రని ఆయన ఇందులో పోషించారు. ఇందులో మరో కోణం ఆయన పాత్రకి ఉంది. ఇలాంటి పాత్రలు ఆయనకి కొత్తేం కాదు. తన పాత్రలోని వైవిధ్యం, ఆ వైవిధ్యానికి తగినట్లుగా శ్రీరామ్ అమరిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. సంధ్యగా నటించిన ప్రియాంక తిమ్మేష్ పాత్రపైనే ఈ సినిమా అంతా నడుస్తుంది. గృహిణిగా చక్కని అభినయం ఆమె ప్రదర్శించింది. మరో కీలక పాత్రలో షీలాగా నటించిన నిహారిక పాత్ర కనిపించేది కాసేపే అయినా కుర్రకారుకు హీటెక్కిస్తుంది. తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. రఘు పాత్రలో నటించిన వియాన్, కండలు తిరిగిన శరీరంతో కనిపించారు. అమాయకుడిగానూ, అలాగే కథలో కీలకమైన పాత్రలోనూ వియాన్ మెప్పించారు.

సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. మరీ ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన జుబిన్.. ఓ స్టార్ హీరో సినిమా చూస్తున్న ఫీల్‌ని తెప్పించారు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చక్కగా ఉంది. ఎడిటింగ్ పరంగా కూడా ఎటువంటి వంకలు లేవు. మధ్యలో ఒకటి రెండు సీన్లు కాస్త స్లో అనిపించినా, కథలోని థ్రిల్లింగ్ అంశాలు దానిని డామినేట్ చేస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. స్ట్రైయిట్ తెలుగు సినిమా చూస్తున్న ఫీల్‌ని దర్శకుడు కలిగించారు. 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement