ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. సునీల్ హీరోగా రాజమౌళి తీసిన ‘మర్యాద రామన్న’ (2010) సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాని ‘సన్ ఆఫ్ సర్దార్’గా అజయ్ దేవగన్(Ajay Devgn) హీరోగా హిందీలో రీమేక్ చేశారు. అయితే ఇప్పటివరకు ‘మర్యాద రామన్న’కు సీక్వెల్ రాలేదు కానీ ‘సన్ ఆఫ్ సర్దార్’కు మాత్రం మళ్ళీ అజయ్ దేవగన్ హీరోగా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈసారి టైటిల్ మాత్రమే సీక్వెల్‌గా తీసుకున్నా కథను మాత్రం తమ పంథాలో తీసుకున్నారు మేకర్స్.
ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. దీనికి అజయ్ దేవగన్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. కథ దాదాపుగా స్కాట్‌ల్యాండ్‌లోనే జరుగుతుంది. ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తుందీ చిత్రం. ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ కథాంశానికొస్తే... జస్సీ సింగ్ రాండ్వా పెళ్లయినా పరిస్థితుల ప్రభావం వల్ల తన భార్య విదేశాలలో ఉంటుంది. జస్సీ మాత్రం తన తల్లితో భారత్‌లో ఉంటాడు. సినిమా ప్రారంభంలోనే జస్సీ భార్య డింపుల్ ఫోన్ చేసి, జస్సీకి వీసా అప్రూవ్ అయిందని, వెంటనే తను కూడా తన దగ్గరకు రావచ్చని చెబుతుంది. ఎంతో ఆనందంతో భార్యను కలవడానికి విదేశాలలో అడుగు పెట్టిన జస్సీతో విడాకులు కావాలని షాకిస్తుంది డింపుల్.

ఖంగుతిన్న జస్సీ ఏం చేయాలో తోచని స్థితిలో ఫ్రెండ్ ఇంటికి వెళతాడు... అనుకోకుండా పాకిస్థాన్‌కి చెందిన రబియాని కలుస్తాడు జస్సీ. రబియాకి సాబా అనే కూతురు ఉంటుంది. భర్త వదిలేసి వెళ్ళిపోతాడు. రబియా కూతురు సాబా గ్యాంగ్‌స్టర్ రాజా సంధు కొడుకైన రాజాతో ప్రేమలో ఉంటుంది. రాజా సంధుకు భారత దేశమంటే ఎంత ప్రేమో అంతకు మించి పాకిస్థానీయులంటే ద్వేషం. అటువంటి అతని కొడుకు ఓ పాకిస్థానీ ప్రేమలో పడతాడు. జస్సీని తన భర్తగా ఉండమని చెప్పి తామిద్దరూ పంజాబీ దంపతులుగా నటించి, రాజా సంధుతో సంబంధం ఖాయం చేసుకోవాలని చూస్తుంటుంది రబియా.
ఇదే సమయంలో రాజా సంధు ఓ పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడు. ఆ ఫంక్షన్‌లో రబియా, జస్సీ తల్లిదండ్రులుగా సంబంధం ఖాయం చేసుకునే సమయంలో అటు రబియా అసలు భర్త రావడంతో పాటు ఇటు జస్సీ భార్య డింపుల్ కూడా తారసపడుతుంది. ఈ గందరగోళంలో రబియా తన కూతురు పెళ్ళి చేయగలుగుతుందా? లేదా అన్నది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా మంచి కామెడీ కాలక్షేపం. ఎందుకంటే ఇది కామెడీ ఆఫ్ సర్దార్ కాబట్టి. వర్త్ టు వాచ్.
– హరికృష్ణ ఇంటూరు


