ఉదయం షూటింగ్‌కి వెళ్లడం... రాత్రికి ఇంటికి చేరుకోవడం... ఇలా లోకల్‌లో షూటింగ్ చేసినప్పుడు స్టార్స్ ఇంటిని మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కొందరు స్టార్స్ అలా ఇంటిని మిస్ కాకుండా హైదరాబాద్‌లో జోరుగా హుషారుగా షూట్‌తో బిజీగా ఉంటున్నారు. ఆ స్టార్స్ ఏయే సినిమాల షూట్‌లో ఉన్నారో తెలుసుకుందాం.
గండిపేటలో కింగ్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో నాగార్జున ఒకరు. తన కెరీర్‌లో 99 సినిమాలు పూర్తి చేసుకున్న ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ 100’. నాగార్జున ఫిల్మ్ జర్నీలో ఓ మైల్‌స్టోన్ మూవీగా రూపొందుతోంది. ఈ సినిమాకి తమిళ దర్శకుడు ఆర్.ఎ. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు తన అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న సినిమా ఇది.
ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో పాటు నటి టబు పాల్గొంటున్నారు. వీరిద్దరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు కార్తీక్. –టబు కాంబినేషన్‌లో ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. అదే విధంగా ‘సిసింద్రి’ సినిమాలోనూ వీరిద్దరూ ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ పాటలో కనిపించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ‘కింగ్ 100’ మూవీ కోసం వీరిద్దరూ మరోసారి కలిసి నటిస్తున్నారు. వీరి రీ యూనియన్ మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయబోతోందని ఫిల్మ్‌నగర్ టాక్. నాగార్జున కెరీర్‌లో ఓ ల్యాండ్‌మార్క్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. నాగార్జున సినీ ప్రయాణానికి పర్ఫెక్ట్ సెలబ్రేషన్ గా ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట ఆయన. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2027 జనవరికి విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.
జన్వాడలో...
‘వీర సింహారెడ్డి’ సినిమా తర్వాత బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎన్‌బీకే 111’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రాన్ని వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ముంబయ్ నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్‌ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ కథ ఉంటుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో ‘గుంటూరు కారం’ మూవీ సెట్‌లో జరుగుతోందని తెలిసింది.
బాలకృష్ణతో పాటు ఇతర తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట గోపీచంద్ మలినేని. ఈ మూవీలో హీరోయిన్‌గా తొలుత నయనతార పేరు వినిపించింది. అయితే ఆ తర్వాత ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ నటించనున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మరి... వీరిద్దరిలో ఎవరు ఫిక్స్ అవుతారు? లేదంటే మరో హీరోయిన్ ఖరారు అవుతారా? అనేది వేచి చూడలి. ఇదిలా ఉంటే... ‘ఎన్‌బీకే 111’లో ఓ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ చిందేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ పాటని చిత్రీకరించనున్నారట మేకర్స్.
అన్నపూర్ణలో ఆదర్శ కుటుంబం
‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) సినిమాతో తన కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు వెంకటేశ్. అంతేకాదు... ఈ మూవీ ద్వారా రూ. 300కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరి, సరికొత్త రికార్డును సృష్టించారాయన. ఈ చిత్రం తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ‘హౌస్ నెం: 47 (ఏకే 47)’ అనేది ఉపశీర్షిక. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ‘కేజీఎఫ్, ‘హిట్ 3, తెలుసు కదా’ చిత్రాల ఫేమ్ శ్రీనిధీ శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేశ్ కెరీర్‌లో 77వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. కుటుంబ ప్రేక్షకుల్లో వెంకటేశ్ ఇమేజ్‌కి తగ్గ అందమైన కుటుంబ కథాంశం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారట త్రివిక్రమ్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోలో జరుగుతోంది. వెంకటేశ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రంలో మధ్యతరగతి వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు
వెంకటేశ్. వినోదం, భావోద్వేగాల కలయికలో రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్ మార్క్ కామెడీతో పాటు త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరించిన ఓ హై ఓల్టేజ్ క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందట. వెంకటేశ్ హీరోగా నటించిన పలు హిట్ సినిమాలకు మాటలు అందించిన త్రివిక్రమ్ ఇప్పుడు ఆయన హీరోగా తన దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే... వెంకటేశ్–కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమాలో వెంకటేశ్‌కి జోడీగా కీర్తీ సురేష్ నటిస్తారు. అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ స్టయిల్, హ్యూమర్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందనున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది.
గండిపేటలో వారణాసి
మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’. మహేశ్ హీరోగా నటిస్తున్న 29వ సినిమా ఇది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు పోడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే విడుదలైన ఆయన గెటప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన వారణాసి సెట్‌లో మహేశ్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ ఎపిక్ అడ్వెంచరస్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు ఎదురు చూస్తున్నారు.
‘వారణాసి’ని గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 120 దేశాల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేశ్‌బాబు శ్రీరాముడిగా, రుద్రుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మహేశ్‌బాబు–రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాసి’పై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఆర్‌ఎఫ్‌సీలో...
ప్రభాస్ వరుస పాన్ ఇండియన్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఓ వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీ చేస్తున్న ఆయన మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రం చేస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్‌లో సమాంతరంగా పాల్గొంటున్నారాయన. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజి’. ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్న్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి. ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎన్నడూ చూడని పవర్‌ఫుల్ పాత్రలో చూపించబోతున్నారట. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.
పీరియాడికల్ యాక్షన్
‘దేవర’ వంటి హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
పీరియాడికల్ యాక్షన్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌తో పాటు ఇతర తారాగణంపై కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్. కొంత టాకీ పార్టుతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమా ప్రధాన కథకు ఇంటర్నేషనల్ టచ్ ఉంటుందని, ప్రధాన కథాంశం 1969 నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. అంతేకాదు... ముఖ్యంగా కోల్‌కత్తా ప్రస్తావన ఉంటుందట.
ఇప్పటి వరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని చూపించనున్నారు ప్రశాంత్ నీల్. ఈ మూవీలో టు షేడ్స్‌లో కనిపించనున్నారట ఎన్టీఆర్. ఓ లుక్‌లో సన్నగా కనిపించే ఆయన మరో లుక్‌లో కొంచెం బొద్దుగా కనిపిస్తారని తెలిట. మాస్ హీరో, మాస్ డైరెక్టర్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై ఇటు ట్రేడ్ వర్గాలో,్ల అటు ప్రేక్షకుల్లో బజ్ నెలకొంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2027 జూన్ 11న విడుదల కానుంది.
అజీజ్‌నగర్‌లో...
గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భరత వర్ష’. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. హిస్టారికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో గోపీచంద్, రీతూ వర్మ, ఇతర నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట సంకల్ప్ రెడ్డి. ‘‘హిస్టారికల్ నేపథ్యంలో భారీ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘భరత వర్ష’.
గోపీచంద్ ఈ మూవీలో యోధుడి పాత్ర కోసం కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఆయన ఫిజిక్, నటన, స్క్రీన్ ప్రెజెన్న్స్ అన్నీ కలిసి ఈ పాత్రను ఎంతో నిజాయితీగా కనిపించేలా చేస్తాయి. ఇది ఆయన గత చిత్రాల నుండి పూర్తిగా భిన్నమైన పాత్రగా నిలుస్తోంది. టెక్నికల్‌గా ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయిలో రూపొందిస్తున్నాం. ఈ సినిమాలో సత్యవతిగా రీతూ వర్మ నటిస్తున్నారు. ఇన్నోవేటివ్ కథనాలు, హై టెక్నికాల్టీకి పేరుగాంచిన సంకల్ప్ రెడ్డి... భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని ఈ మూవీ ద్వారా తెరపై ఆవిష్కరించబోతున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే... గోపీచంద్ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ‘గోపీచంద్ 34’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే.
ముచ్చింతల్‌లో...
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మంచు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో నానితో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే శక్తిమంతమైన పాత్రలో నాని కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘ఆయా షేర్...’ పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
యాక్షన్ డ్రామా
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అన్నది ట్యాగ్‌లైన్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. హై ఓల్టేజ్ పీడియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘భోగి’ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో శగుతోంది.
ఈ షెడ్యూల్‌లో శర్వానంద్‌పై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట సంపత్ నంది. ఫిబ్రవరి 6న శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా ‘భోగి’ నుంచి విడుదల చేసిన ఆయన బర్త్ డే పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ పాన్–ఇండియా మూవీగా ‘భోగి’ని రూపొందిస్తున్నాం. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.
ఈ చిత్రం శర్వానంద్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్‌లలో ఒకటిగా ఉంటుంది. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్న్స్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో అద్భుతమై సంగీతం అందించారు. ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
శంకర్‌పల్లిలో...
హీరో శ్రీ విష్ణు, డైరెక్టర్ రామ్ అబ్బరాజులది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘సామజవరగమన’ 2023 జూన్ 28న విడుదలై థియేటర్లలో నవ్వులు కురిపించడంతో పాటు హిట్‌గా నిలిచింది. ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్ నిర్మిస్తున్నారు.
వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ హిలేరియస్ కామెడీ డ్రామా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారట రామ్ అబ్బరాజు. ఈ సినిమా ద్వారా ‘సామజవరగమన’ చిత్రాన్ని మించిన నవ్వులు పంచాలనే బలమైన ఆలోచనతో తెరకెక్కిస్తున్నారట రామ్ అబ్బరాజు. ఈ సినిమాలో ‘మోగ్లీ’ మూవీ ఫేమ్ సాక్షీ మదోల్కర్ కథానాయికగా నటించనున్నారని టాక్.
‘వెన్నెల’, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.
– డేరంగుల జగన్ మోహన్


