P Devaraj: ఎందుకు బతుకుతున్నానో తెలీదు, చచ్చిపోవాలనుంది: సినిమాటోగ్రాఫర్‌ కంటతడి

Senior Camera Man P Devaraj Emotional Over His Financial Problems - Sakshi

సినిమాను అద్భుతంగా తీయడానికి కెమెరామన్స్‌ ఎంతగానో కష్టపడుతారు. తెర వెనక వారి జీవితాల్లోనూ అంతే కష్టం దాగుటుంది. అందుకు సీనియర్‌ సినిమాటోగ్రాఫర్‌ పి. దేవరాజ్‌ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తారు. ఛాలెంజ్‌ రాముడు, లాయర్‌ విశ్వనాథ్‌, పులి-బెబ్బులి, ఖైదీ కాళిదాస్‌,  భలే తమ్ముడు, సింహ గర్జన.. ఇలా దాదాపు 300 సినిమాలకు పని చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ.. ఇలా ఎన్నో భాషల్లో సినిమాలు చేసుకుంటూ పోయిన ఆయన ప్రస్తుతం దీన స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో తన పరిస్థితి గురించి వెల్లడిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారాయన.

'నా తండ్రి శ్రీధర్‌ పెద్ద కెమెరామన్‌. ఎన్నో హిట్‌ సినిమాలకు ఆయన పని చేశారు. నేనీ వృత్తిలోకి రాకూడదనుకున్నాను. కానీ ఆయన మరణంతో ఇంట్లో 12 మందిని పోషించాల్సిన బాధ్యత నామీద పడింది. తప్పని పరిస్థితిలో సినిమాటోగ్రాఫర్‌గా మారాను. కష్టపడి పని చేశా.. పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాను. ఎంతోమందికి సాయం చేసిన నేను ఇప్పుడు  కనీసం నడవలేని స్థితిలో సాయం కోసం అర్థిస్తున్నాను.

పూట గడవడం కూడా కష్టమవుతోంది. నా స్నేహితుడు రజనీకాంత్‌ నెలకు రూ.5000 పంపిస్తాడు. మురళీ మోహన్‌ టాబ్లెట్ల కోసం మూడు వేలు పంపిస్తాడు. సినిమాల్లో జయప్రద, ప్రభ, విజయశాంతి.. ఇలా ఎంతోమంది ఆర్టిస్టులను సినిమాలకు రికమెండ్‌ చేశాను. కానీ వారెవరూ సాయానికి ముందుకు రావడం లేదు. ఇంటి అద్దె రూ.8 వేలు. అది కూడా కట్టలేని స్థితిలో ఉన్నాను. నాకు ఆపరేషన్‌ చేయాలంటే ఏడు లక్షల దాకా అవుతుంది. నాకంత స్థోమత లేదు. ఎందుకు బతికున్నానో తెలీదు, చచ్చిపోవాలనుంది' అంటూ కన్నీటిపర్యంతమయ్యారు దేవరాజ్‌.

చదవండి: అందుకే మెడలో మంగళసూత్రం ధరిస్తా: సింగర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top