తమిళ హీరో ధ్రువ సర్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "కేడీ: ద డెవిల్". బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, శిల్పాశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో నోరా ఫతేహి ఐటం సాంగ్‌లో మెరిసింది. ఇటీవలే కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఆ ఐటం సాంగ్‌ను విడుదల చేశారు.
బూతు పాట
అయితే హిందీలో ఆ పాట లిరిక్స్ పచ్చిబూతులతో అసభ్యంగా ఉంది. డ్యాన్స్ కూడా అశ్లీలంగా ఉండేసరికి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో కేంద్రం.. ఈ పాటను తొలగించాలని ఆదేశించింది. అలా హిందీ వర్షన్‌ను యూట్యూబ్ నుంచి తీసేశారు. తాజాగా ఈ వివాదంపై హిందీలో 'సర్కే చునర్' పాటకు లిరిక్స్ అందించిన గేయరచయిత రఖీబ్ ఆలం స్పందించాడు.
నేను సొంతంగా రాయలేదు
ఆ లిరిక్స్ సొంతంగా తాను రాసినవి కావన్నాడు. కన్నడలో దర్శకుడు ప్రేమ్ రాసిన లిరిక్స్‌నే యథాతథంగా హిందీలో అనువదించాను. నిజానికి ఈ పాటను హిందీలో రాయమన్నప్పుడే నేను తిరస్కరించాను. ఇలాంటివి సెన్సార్ ఒప్పుకోవు, వర్కవుట్ కాదన్నాను. కన్నడ వర్షన్‌ను అచ్చుగుద్దినట్లుగా హిందీలో మార్చమని అప్పగించారు. చాలా డబుల్ మీనింగ్ లైన్స్ ఉన్నాయి. కానీ అదంతా ఒక మద్యం సీసా గురించి అని వారు చిట్టచివర్లో బయటపెట్టారు.
అవేవీ గుర్తించలేదు
అయితే అది తెలిసేవరకు ఆ లైన్స్ అన్నీ అసభ్యకరంగానే అనిపిస్తాయి. అదే విషయం నేనూ చెప్పాను. అసలు ఇలాంటి పాటలు రాయాల్సిన అవసరం నాకేంటి? నేను మంచి పాటలు రాసినప్పుడు ప్రజలు వాటిని పట్టించుకోరు. రామ్‌చరణ్ పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాటకు హిందీలో నేనే సాహిత్యాన్ని అందించాను. పుష్ప మూవీలోని అన్ని పాటలు హిందీలో నేనే రాశాను. అవేవీ గుర్తించలేదు..
కొత్త వర్షన్ వస్తుంది
కానీ సర్కే చునర్ సాంగ్ వల్ల అభాసుపాలయ్యాను, ఎంతో అవమానకరంగా ఉంది. నేను చెప్పినట్లే పాటపై అభ్యంతరాలు వచ్చాయి. దాంతో మేకర్స్ ఎటువంటి అసభ్యతకు చోటు లేకుండా కొత్త వర్షన్ రాయమని అడిగారు. అది ఆల్‌రెడీ రాసి పంపాను. త్వరలోనే చిత్రయూనిట్ క్షమాపణలు చెప్పి కొత్త లిరిక్స్‌తో ఉన్న పాట రిలీజ్ చేస్తుంది అని రఖీబ్ చెప్పుకొచ్చాడు.
చదవండి: సినిమాపై భయం.. అబ్బాస్‌కు మంచి కమ్‌బ్యాక్: జీవీ ప్రకాశ్ కుమార్


