Sakshi News home page

‘సైంధవ్‌’ కోసం ‘ఇంద్రప్రస్థ’ అనే ఫిక్షనల్ టౌన్, కథ రోటీన్‌గా ఉండదు : డైరెక్టర్‌

Published Wed, Jan 10 2024 10:29 AM

Sailesh Kolanu Talk About Saindhav Movie - Sakshi

‘‘ఓ ప్రాసెస్‌ను ఫాలో అవుతూ నిజాయితీగా సినిమా తీస్తే, ఆ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతాను. ‘సైంధవ్‌’ను కూడా ఇలాగే తీశాను. ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అలాగే జయాపజయాల గురించి ఆలోచించే మనస్తత్వం నాకు లేదు. నా ప్రయాణాన్ని ఆస్వాదిస్తాను’’ అన్నారు శైలేష్‌ కొలను. వెంకటేశ్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన  చిత్రం ‘సైంధవ్‌’. వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో శైలేష్‌ కొలను చెప్పిన విశేషాలు.

‘హిట్‌ 2’ రిలీజ్‌ తర్వాత నిర్మాత వెంకట్‌గారు చెప్పారని వెంకటేశ్‌గారిని కలిశా. ఆయన్ను కలిసిన తొలిసారి మేం సినిమాలు కాకుండా జీవిత విశేషాలను మాట్లాడుకున్నాం. అలా రెండు మూడుసార్లు కలుసుకున్నాక ఓ సందర్భంలో ఆయనకు ‘సైంధవ్‌’ స్టోరీ లైన్‌ చెప్పాను. ఆ తర్వాత పూర్తి కథ చెప్పా. ‘ఈ స్క్రిప్ట్‌ నా 75వ సినిమాకు సరిపోతుందనిపిస్తోంది. ఈ సినిమా చేద్దాం’ అన్నారు. వెంకటేశ్‌గారి అనుభవం, ఆయన సూచనలు, సలహాలు తీసుకుని ‘సైంధవ్‌’ స్క్రిప్ట్‌ను మరింత బాగా రెడీ చేశాను. అలాగే  వెంకటేశ్‌గారు చెప్పారని, సురేష్‌బాబుగారికి కూడా కథ వినిపించాను. ఆయన కొన్ని ఇన్‌పుట్స్‌ ఇచ్చారు

► దర్శకుడిగా నేను తొలుత ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్స్‌ చేశాను. కానీ ‘సైంధవ్‌’ ఎమోషనల్‌ డెప్త్‌ ఉన్న ఫిల్మ్‌. స్పైనల్‌ మస్కులర్‌ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన చిన్నారి కుమార్తె గాయత్రిని (సారా పాత్ర)ని తండ్రిగా సైంధవ్‌ (వెంకటేశ్‌ పాత్ర) ఏ విధంగా కాపాడుకుంటాడు? గాయత్రికి కావాల్సిన రూ. 17 కోట్ల ఖరీదైన ఇంజక్షన్‌ కోసం ఏ విధంగా పోరాటం చేస్తాడు? అనేది ఈ చిత్రకథ. వెంకటేశ్‌గారి పాత్రకు ఫ్లాష్‌బ్యాక్‌ స్టోరీ ఉంటుంది. కానీ రొటీన్‌గా ఉండదు. ఎంత కొత్తగా డిజైన్‌ చేశానన్నది థియేటర్స్‌లో చూస్తారు.

► డ్రగ్ కార్టేల్స్, గన్ బిజినెస్..ఇలా పెద్ద స్కేల్ లో ఇందులో కథ జరుగుతుంటుంది. ఈ కథ సముద్రతీరంలో జరగాలి. వైజాగ్ లో ఇంత పెద్ద కార్యకలాపాలు జరుగుతాయంటే నమ్మశక్యంగా ఉండదు. ముంబైలో పెట్టుకుంటే నేటివిటీ పోతుంది. అందుకే ‘ఇంద్రప్రస్థ’ అనే ఫిక్షనల్ టౌన్ ని క్రియేట్ చేశాం. మేజర్‌గా నైట్‌ షూట్‌ చేయాల్సి వచ్చింది. నైట్‌ షూట్స్‌ అని వెంకటేశ్‌గారికి ముందే చెప్పాను. బాగా సపోర్ట్‌ చేశారు. ‘సైంధవ్‌’ను ప్రేక్షకులు సపోర్ట్‌ చేస్తే పార్ట్‌ 2 చేసే స్కోప్‌ కథలో ఉంది.

► థ్రిల్లర్స్, యాక్షన్‌ చిత్రాలే కాదు.. ఓ దర్శకుడిగా అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. నాది ప్రేమ వివాహం. నా జీవితంలో జరిగిన లవ్‌ మూమెంట్స్‌ను ఓ కథగా రాశాను. తప్పకుండా ఈ సినిమా చేస్తాను. అలాగే నానీగారితో ‘హిట్‌ 3’ ఉంటుంది. 

Advertisement

What’s your opinion

Advertisement