‘సాగర సంగమం’ ఛాయాగ్రాహకుడు పీఎస్‌ నివాస్‌ కన్నుమూత

Saagarasangamam Photographer PS Nivas passed away - Sakshi

ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీఎస్‌ నివాస్‌ (73) సోమవారం తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కేరళలోని కోళిక్కోడ్‌లో ప్రభుత్వాస్పత్రిలో కన్నుమూశారు. క్యాలికట్‌లోని నడక్కావులో పుట్టారు నివాస్‌. చెన్నైలోని అడయార్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిలిం టెక్నాలజీలో సినిమాటోగ్రఫీ కోర్స్‌ చేశారు. ఛాయాగ్రాహకుడిగా ఆయన తొలి చిత్రం మలయాళ ‘సత్యత్తింటే నిళల్‌’ (1975). మలయాళ చిత్రం ‘మోహినీయాట్టమ్‌’ ఆయనకు ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. భారతీరాజా దర్శకత్వంలో కమల్‌హాసన్‌–రజనీకాంత్‌–శ్రీదేవి కాంబినేషన్‌లో రూపొందిన ‘16 వయదినిలే’ (1977) చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమయ్యారు.

మలయాళ, తమిళ చిత్రాలు చేస్తూ ‘వయసు పిలిచింది’ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత చేసిన ‘నిమజ్జనం’ (1979) ఆయనకు ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా నంది అవార్డు తెచ్చిపెట్టింది. చిరంజీవి ‘పునాదిరాళ్లు,  కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపొందిన క్లాసిక్‌ ‘సాగర సంగమం’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడు నివాసే. భారతీరాజా లీడ్‌ రోల్‌లో నటించిన తమిళ చిత్రం ‘కల్లుక్కుళ్‌ ఈరమ్‌’ ద్వారా దర్శకుడిగా మారారు నివాస్‌. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత తమిళంలో 3 సినిమాలకు దర్శకత్వం వహించారు. నివాస్‌ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top