కలిసిరాని 2020.. కళ తప్పిన ‘సినీ’ పండగ

Recap 2020: Telugu Movies In 2020 - Sakshi

చిత్ర పరిశ్రమను గట్టి దెబ్బ కొట్టిన కరోనా

సినీ ప్రేమికులను కాపాడిన ఓటీటీ సంస్థలు

2020.. ప్రపంచానికే ఓ బ్లాక్‌ ఇయర్‌. ఈ ఇయర్‌లోకి ఎంటరైన రెండు నెలలకే కరోనా వైరస్ మానవాళిపై‌ దాడి చేసింది. ఈ మహమ్మారి దాటికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికి పోయింది. అన్ని రంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు అయితే గట్టి దెబ్బ కొట్టింది. టాలీవుడ్‌లో ప్రతి ఏడాది దాదాపు 250 సినిమాల వరకు విడుదలై ప్రేక్షకుల్ని అలరించేవి. కానీ కరోనా ధాటికి ఈ ఏడాది దాదాపు 50 సినిమాలు కూడా విడుదల కాలేదు. సంక్రాంతి తప్ప.. ఈ ఏడాది మొత్తంలో ఒక్క స్టార్‌ హీరో సినిమా కూడా థియేటర్లలో విడుదలవలేదు. 2020లో విడుదలైన సినిమాలేంటి? వాటిలో ఏవి హిట్‌ అయ్యాయి. ఏవి ప్లాప్‌ను మూటగట్టుకున్నాయి? సమగ్ర సమాచారం మీకోసం...

సంక్రాంతికి సందడి చేసిన మహేశ్‌-బన్నీ
టాలీవుడ్‌ సినిమా క్యాలెండర్‌ ప్రతి ఏటా సంక్రాంతి నుంచి మొదలవుతుంది. ఈ సీజన్‌లో బడా హీరోలంతా బరిలోకి దిగుతారు. వీలైనన్ని పెద్ద సినిమాలు సంక్రాంతికి వస్తాయి. ఈ సారి కూడా పెద్ద పెద్ద సినిమాలే సంక్రాంతి బరిలోకి దిగాయి. మహేశ్‌ బాబు సరిలేరు నీకెవ్వరుతో బరిలోకి దిగగా... ‘అల వైకుంఠపురములో’తో అల్లుఅర్జున్‌ రంగంలోకి దూకాడు. ఇక ‘ఎంతమంచివాడవురా’ అంటూ కళ్యాణ్‌ రాము సంక్రాంతి పోరులో నిలిచారు. అయితే ఈ ముగ్గురిలో మాత్రం.. మహేశ్‌- బన్నీల మధ్యే ప్రధాన పోరు జరిగింది. ఒక్క రోజు తేడాతో వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాపీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి.  ఈ రెండు సినిమాల్లో మాత్రం ‘అల వైకుంఠపురములో’కి కాస్త ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక రెండు భారీ సినిమాల మధ్య విడుదల అయిన కల్యాణ్‌ రామ్‌ ‘ఎంత మంచివాడవురా’ ప్లాప్‌ను మూటగట్టుకుంది. 


ప్లాప్‌ను మూటగట్టుకున్న మాస్‌ మహారాజా
మహేశ్‌, బన్నీ సినిమాలు సక్సెస్‌పుల్‌గా రన్‌ అవుతున్న సమయంలో ‘డిస్కోరాజా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. జనవరి 24న విడుదలైన ఈ సినిమా అట్టర్‌ ప్లాప్‌ అయింది.  సినిమా సక్సెస్ అవుతుందని ఎన్నో అశలు పెట్టుకున్న మాస్‌ మహారాజ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. సినిమా కోసం రవితేజ కూడా బాగానే కష్టపడ్డాడు కానీ వర్కౌట్‌ కాలేదు. 

అలరించని ‘అశ్వథ్థామ’
ఛలో’ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరో నాగశౌర్య.. ‘అశ్వథ్థామ’గా ప్రతాపం చూసేందుకు ముందుకు వచ్చాడు. మెహరిన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ  మూవీ ఈ ఏడాది జనవరి 31న విడుదలై పాజిటివ్ టాక్‌ను రాబట్టింది కానీ సిల్వర్ స్క్రీన్‌‌పై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కానీ బుల్లితెరపై మాత్రం సక్సెస్‌ అయింది. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న జెమినీ టీవీ మే 15న ఈ చిత్రాన్ని ప్రసారం చేయగా.. 9.10 టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంది.

మాయ చేయని ‘జాను’
శర్వానంద్ నటించిన ‘జాను’ సినిమా ఫిబ్రవరి 7న విడులైన ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. `96`కి రీమేక్ గా వ‌చ్చిన `జాను` పై ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.  కానీ వాటిని ‘జాను’ అందుకోలేకపోయింది.  `96`కి జిరాక్స్ కాపీగా మిగిలిందే త‌ప్ప‌, ప్ర‌త్యేక‌మైన ముద్ర వేయ‌లేక‌పోయింది. కానీ శర్వానంద్‌, సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి.

డిజాస్టర్‌ మూటగట్టుకున్న‘రౌడీ’
మంచి ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ వాలెంటైన్స్‌ డే రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కానీ ప్రేక్షకుల ప్రేమను మాత్రం చురగొనలేదు.  క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ సినిమా  డిజాస్టర్ అనిపించుకుంది. మూడు ల‌వ్ స్టోరీలు చూపించినా.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఇరవై కోట్లు కూడా రాబట్టలేకపోయిందట.

ఫలించిన ‘భీష్మ’ బాణం
వరుస పరాజయాలను మూటగట్టుకుంటున్న టాలీవుడ్‌ను భీష్ముడుగా వచ్చి కాపాడాడు యంగ్‌ హీరో నితిన్‌. వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్‌, ర‌ష్మిక జంట‌గా న‌టించిన `భీష్మ‌` ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. నితిన్ కెరీర్‌లో ఇది పెద్ద హిట్టుగా నిలిచింది. విజయాలు లేక బోసిపోయిన థియేటర్లకు యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను రప్పించింది.  ఆ సినిమా విడుదలైన కొన్ని వారాలకే లాక్ డౌన్ మొదలైంది. లేకుంటే బాక్సాఫీస్ వద్ద 50కోట్ల క్లబ్ లో చేరేది.

 ‘హిట్‌’ సూపర్‌ హిట్‌ 
నాని నిర్మించిన ‘హిట్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు హీరో విశ్వక్‌ సేన్‌. ఫిబ్ర‌వ‌రి 28న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన `హిట్`…పేరుకి త‌గ్గ‌ట్టే హిట్ అనిపించుకుంది. ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది.

పర్వాలేదనిపించిన ‘పలాస’
మార్చి 6న విడుద‌లైన `ప‌లాస‌` విమ‌ర్శ‌కుల్ని మెప్పించింది. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన సినిమా ఇది. కరోనా వైరస్‌ లేకపోతే ఈ  సినిమా సూపర్‌ హిట్‌ అయ్యేది. సినిమా రిలీజ్‌ అయిన కొద్ది రోజులకే థియేటర్లు మూతపడడంతో సినిమా అంతగా సక్సెస్‌ కాలేదు. థియేట‌ర్ల‌లో పెద్ద‌గా ఆడ‌లేదు గానీ, ఓటీటీలో వ‌చ్చాక‌… ఈసినిమాకి వ్యూవ‌ర్ షిప్ పెరిగింది. ఈ సినిమాలో నాదీ నక్కిలీసు గొలుసు పాట మాత్రం మాస్ ఆడియన్స్ ని ఊపేసింది. మార్చి 17 నుంచి థియేటర్లు మూత పడటం సినిమాల విడుద‌ల‌కు ఊహించ‌ని బ్రేక్ ప‌డింది. 

సినిమాలు లేక విలవిలలాడిన సినీ ప్రేమికులను ఓటీటీ సంస్థలు కాపాడాయి. లాక్‌డౌస్‌ సమయంలో చొరవ చూపి మరి కొన్ని చిత్రాలను విడుదల చేశాయి. వాటిలో నాని, సుధీర్‌ బాబు హీరోలుగా నటించిన ‘వి’, కీర్తీ సురేష్‌ పెంగ్విన్‌, మిస్‌ ఇండియా, అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’అట్టర్‌ ప్లాప్‌ అయ్యాయి. ఇక పెద్ద సినిమాల్లో  సూర్య హీరోగా నటించిన ఆకాశమే హద్దురా మాత్రం హిట్‌ టాక్‌ను సంపాదించుంది. వీటితో పాటు కలర్‌ ఫోటో, మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’, ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య, జోహార్‌ లాంటి చిత్రాలు విజయవంతం అయ్యాయి. మొత్తానికి థియేటర్లు లేని లోటును కొద్దో గొప్పో ఓటీటీ వేదికలు తీర్చాయని చెప్పొచ్చు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top