
ప్రస్తుత దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కీలకమైన ఐదో దశకు చేరుకున్నాయి. మహారాష్ట్రలో మిగిలిన 13 స్థానాలకు ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. అయితే సరిగ్గా ఎన్నికల సమయంలోనే సోషల్ మీడియో ఓ వీడియో పోస్ట్ చేసింది హీరోయిన్ రష్మిక మందన్నా. దీనిపై ప్రధాని మోదీ స్వయంగా స్పందించడంతో అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారిపోయింది. అసలేంటి ఆ వీడియో? ఇంతకీ నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందో చూసేద్దాం పదండి.
ఎలక్షన్స్ వేళ పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా చేసిన వీడియో పొలిటికల్ హాట్‌టాపిక్‌గా మారింది. అటు నార్త్‌లో ఇటు సౌత్‌లో టాప్ స్టార్‌గా దూసుకెళ్తున్న రష్.. కేంద్రంలోని మోదీ సర్కార్‌కు అనుకూలంగా చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో కొందరు నెటిజన్స్ ఆమెను ప్రశంసిస్తుండగా.. మరికొందరేమో వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారు.
ముంబయిలోని సముద్రప్రాంతంలో నిర్మించిన అటల్ సేతు బ్రిడ్జిని ఉద్దేశించి రష్మిక ఓ వీడియోను ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది. అందులో ఇండియా అభివృద్ధిలో దూసుకుపోతుందంటూ ప్రశంసలు కురిపించింది. రెండుగంటల పట్టే ప్రయాణం.. కేవలం 20 నిమిషాల్లోనే చేరుకుంటున్నట్లు ఆనందం వ్యక్తం చేసింది. యంగ్ ఇండియా అభివృద్ధిలో అద్భుతాలు సాధిస్తోందంటూ కొనియాడింది. దేశంలో మౌలికవసతులు, రహదారి ప్రణాళిక అద్భుతంగా ఉందన్న రష్మిక.. అభివృద్ధికే ఓటువేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది ముద్దుగుమ్మ.
అయితే రష్మిక చేసిన వీడియోపై ఏకంగా మన ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారిని అనుసంధానం చేయడానికి మించిన సంతృప్తి ఏముంటుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు రష్మిక మందన వీడియోను తన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు ప్రధాని. అయితే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్‌కు అటల్ సేతు అని పేరు పెట్టింది కేంద్రప్రభుత్వం. జనవరిలో ప్రధాని మోదీ దీనిని జాతికి అంకితం చేశారు. దేశంలోనే పొడవైన వంతెన అటల్ సేతు గుర్తింపును దక్కించుకుంది.
కాగా.. ఈ నిర్మాణం అద్భుతమని ఇప్పటికే పలువురు ప్రముఖుల ప్రశంసలు కురిపించారు. సీ లింక్ ప్రయాణం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తంచేశారు. తాజాగా ఎలక్షన్ టైమ్‌లో రష్మిక మందన వీడియో విడుదల చేయడంపై నెటిజన్లు రష్మికను ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా బీజేపీ ప్రొపగాండాలో భాగమని కొందరు అంటుంటే.. రష్మిక త్వరలోనే రాజకీయాల్లోకి వస్తుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Sir! What an honor! It's incredibly fulfilling to witness our country's growth as a super proud young Indian. 🙏🏻🤍 https://t.co/ZY19v2czFf
— Rashmika Mandanna (@iamRashmika) May 17, 2024