
‘‘ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తున్నాను. నేను చాలా లక్కీ. టాలీవుడ్‌కి తిరిగొచ్చి, మళ్ళీ వరుస సినిమాలు చేస్తుండటం అనేది తెలుగు ప్రేక్షకుల ప్రేమ, ఓ నటిగా నాకు దర్శక– నిర్మాతల్లో ఏర్పడిన గుర్తింపు వల్లేనని నమ్ముతున్నా’’ అని హీరోయిన్ రాశీ ఖన్నా అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించగా, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో రాశీ ఖన్నా పంచుకున్న సంగతులు.
⇒ ‘తెలుసు కదా’ కథను దర్శకురాలు నీరజగారు చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఇది రెగ్యులర్ లవ్‌స్టోరీ కాదు. అందుకే ఒప్పుకున్నాను. నాకు తెలిసి ఈ తరహా ప్రేమకథా చిత్రం ఇప్పటివరకు రాలేదు. ఇందులో మేం ఓ కొత్త పాయింట్‌ని టచ్ చేశాం.
⇒ ‘తెలుసు కదా’లో నేను అంజలి అనే పాత్రలో కనిపిస్తాను. కథలో మా ముగ్గురి (సిద్ధు, అంజలి, రాశీ) పాత్రలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ సినిమా ఆడియన్స్‌కు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. నీరజ బాగా డైరెక్ట్ చేశారు. ఓ మహిళా దర్శకురాలితో నేను పని చేయడం ఇదే తొలిసారి. అయినా డైరెక్షన్‌కి మేల్, ఫీమేల్ అనే తేడాల్లేవ్.
⇒ క్రమశిక్షణతోనే జీవితంలో ఎదగగలమని నమ్ముతాను. అందుకే నేను ఎప్పుడూ క్రమశిక్షణగా ఉంటాను. అలాగే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ఫిట్‌గా ఉండటం ముఖ్యం. నేను ఎప్పుడూ వర్కౌట్స్, సరైన డైట్‌తో ఫిట్‌గా ఉండాలనుకుంటాను. ఇక ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’పై నాకు నమ్మకం లేదు. అదో ఆకర్షణ అనుకుంటాను. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమకు ఉన్న పరిమితులు వంటి అంశాలను ‘తెలుసు కదా’లో ప్రస్తావించాం.
⇒ పవన్ కల్యాణ్‌గారి ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చేస్తున్నాను. హిందీలో చేసిన ‘120 బహదూర్’ చిత్రం నవంబరు 21న విడుదలవుతుంది. విక్రాంత్ మెస్సేతో లవ్ స్టోరీ ఫిల్మ్, మాధవన్‌తో టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేశాను. ‘ఫర్జీ 2’ సిరీస్ చేస్తున్నాను. అలాగే ఒక ఓటీటీ ప్రాజెక్ట్‌లో లీడ్‌గా నటించాను.