
‘‘సు ఫ్రమ్ సో’ మూవీ కన్నడలో బిగ్ బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకువెళతారనే నమ్మకం ఉంది. చక్కని వినోదంతో రూపొందిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని నిర్మాత నవీన్ యెర్నేని తెలిపారు. షనీల్ గౌతమ్, జేపీ తుమినాడ్, ప్రకాశ్ కె. తుమినాడ్, మైమ్ రాందాస్ ముఖ్య తారలుగా జేపీ తుమినాడ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సు ఫ్రమ్ సో’.
ఈ సినిమా జూలై 25న కన్నడలో విడుదలైంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో నేడు రిలీజ్ చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజ్ బి. శెట్టి మాట్లాడుతూ– ‘‘మంచి కంటెంట్‌తో తీస్తే మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మాతలు సపోర్ట్ చేస్తారనే నమ్మకం కలిగింది. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు.
‘‘తెలుగులో కూడా మా సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు జేపీ తుమినాడ్. ‘‘ఒకప్పుడు ఈవీవీ సత్యనారాయణగారి సినిమాల్లో పూర్తి వినోదం ఉండేది. ఆ తర్వాత ఆ వినోదాన్ని చాలా రోజులు మిస్ అయ్యాం. ఆ లోటును ‘సు ఫ్రమ్ సో’ భర్తీ చేస్తుంది’’ అని మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి చెప్పారు.