
తెలుగు నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడు. నిర్మాతగా హిట్లు, బ్లాక్‌బస్టర్స్ అందుకున్న ఆయన సినిమా నిర్మించి చాలా ఏళ్లవుతోంది. అయితే ఇటీవల దీపావళి పండక్కి టాలీవుడ్ సెలబ్రిటీలను పిలిచి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకకు చిరంజీవి, వెంకటేశ్, శ్రీకాంత్, రోషన్, శివాజీ, తేజ సజ్జ, అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, బెల్లంకొండ శ్రీనివాస్, తరుణ్.. తదితరులు హాజరయ్యారు.
సిద్ధుపై పొగడ్తలు
ఈ హడావుడి అంతా చూస్తుంటే బండ్ల గణేశ్ టాలీవుడ్‌లో రీఎంట్రీకి రెడీ అయ్యాడని అందరికీ అర్థమైపోయింది. తాజాగా అదే నిజమని ధ్రువీకరించాడు. తెలుసు కదా సినిమా (Telusu Kada Movie) బ్లాక్‌బస్టర్ సక్సెస్ ఈవెంట్‌కు బండ్ల గణేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా నటుడు అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ.
నేనైతే ఈ సినిమా తీయను
జోష్ సినిమాలో చిన్న వేషం కోసం తపించిన సిద్దు.. మరో రవితేజ అవుతాడు. సిద్దు, తేజ సజ్జ.. ఈ యంగ్ జనరేషన్‌ను చూస్తుంటే ముచ్చటేస్తోంది. మీరు రెండు దశాబ్దాలపాటు సినీ ఇండస్ట్రీకి హిట్స్ ఇవ్వడానికి పుట్టినవాళ్లు! నేనైతే నిర్మాతగా తెలుసు కదా సినిమా తీయను. ఈ మూవీ తీయడానికి దమ్ము, ధైర్యం కావాలి. ఈ విషయంలో విశ్వప్రసాద్‌ను అభినందించాల్సిందే! మీరు మా తోటి నిర్మాత అవడం సంతోషంగా ఉంది.
రీఎంట్రీ అడిగారుగా..
నీరజ కోన.. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చింది. అయినా కూడా అందరినీ కలుపుకుపోతూ దర్శకురాలిగా మారడం అంటే మాటలు కావు. హ్యాట్సాఫ్. నిర్మాత ఎస్‌కేఎన్ నన్ను రీఎంట్రీ ఇవ్వమని అడిగాడు. నేను టెంపర్ సినిమాతో బ్రేక్ తీసుకున్నాను. ఫ్లాప్ మూవీతో కాదు, బ్లాక్‌బస్టర్ సినిమా ఇచ్చి బ్రేక్ తీసుకున్నా.. ఇప్పుడు మొదలవుతుంది సెకండాఫ్! అసలు సినిమా మొదలు కాబోతుంది అంటూ సెకండ్ ఇన్నింగ్స్ ఉండబోతుందని చెప్పకనే చెప్పాడు.
చదవండి: సినిమా ఇండస్ట్రీలో రూ.1000 కోట్లు నష్టపోయా! లైన్లో నిలబడి..