ఆర్టిస్ట్‌లు లోకల్‌ కాదు.. యూనివర్సల్‌

Prakash Raj Press Meet On MAA Elections 2021 With His Panel Members - Sakshi

– ప్రకాశ్‌రాజ్‌

‘‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అనేది ఒక చిన్న సంస్థ. ఈ అసోసియేషన్‌ ఎన్నికలకు సంబంధించి నాలుగైదు రోజులుగా టీవీల్లో ‘మా’ ఎన్నికల్లోకి రాజకీయ పార్టీలు వచ్చేశాయట, కేసీఆర్, కేటీఆర్‌గార్లు, ఆంధ్ర సీఎం జగన్‌గారు వచ్చేశారట’ అనే ఊహాగానాల వార్తలు చూపిస్తున్నారు. ఈ విషయం గురించి మేం ప్రెస్‌మీట్‌ పెట్టకుంటే అమెరికా అధ్యక్షుడు సైతం వచ్చేశారని చూపిస్తారేమోనని భయం వేసింది’’ అని నటుడు ప్రకాశ్‌రాజ్‌ వ్యంగ్యంగా అన్నారు. సెప్టెంబర్‌లో జరిగే ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి బరిలో దిగుతున్న ప్రకాశ్‌రాజ్‌ శుక్రవారం తన టీమ్‌తో కలసి ప్రెస్‌మీట్‌ పెట్టి, ఆయన మాట్లాడుతూ–

► ‘మా’ సమస్యలపై రెండేళ్లుగా ఆలోచిస్తున్నా. సమస్యలు పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ‘మా’కి సొంత భవనం కోసం ఏం చేయాలి? ప్యానెల్‌లో ఎవర్ని తీసుకోవాలనే విషయాలపై ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను.

► సినీ పరిశ్రమ ఎంతో సున్నితమైనది. అందరూ అందరికీ కావాల్సినవాళ్లే. ఎవరివైపు ఎవరున్నారనే  ఊహాగానాలు అనవసరం. ఎన్నికలకు ఇంకా మూడు నెలల టైమ్‌ ఉంది. ఇప్పుడే మాట్లాడటం ఎందుకు? మా ప్యానల్‌లో అందరూ క్రమశిక్షణ ఉన్నవారు. ఎలక్షన్‌ డేట్‌ వచ్చేదాకా ఎవరూ మీడియా ముందుకు రారు.

► మాది సిని‘మా’ బిడ్డల ప్యానల్‌. పదవి కోసం కాకుండా పని చేయడం కోసం పోటీ చేస్తున్నాం. మా ప్యానల్‌లో ఉన్నవారందరూ ప్రశ్నించేవాళ్లే. నేను తప్పు చేస్తే ప్రశ్నించి, నన్ను పక్కకు తప్పుకోమంటారు. పైగా అధ్యక్షస్థానానికి తగ్గ నలుగురు నా ప్యానల్‌లో ఉన్నారు. మా ప్యానల్‌ ఆవేశంతో పుట్టుకురాలేదు. ఆవేదనతో పుట్టుకొచ్చింది. చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్‌బాబు, నాగార్జున.. ఇలా అందరూ ‘మా’ అభివృద్ధిని కోరుకుంటున్నారు. అర్హత చూసి మన స్సాక్షిగా ఓటేయండి. పని చేసి చూపిస్తాం.

► నేను ‘మా’ అధ్యక్ష బరిలో నిలుస్తున్నాను అని ప్రకటించినప్పటి నుంచి నాన్‌ లోకల్‌ అంటున్నారు. ఇలాంటి మాటలు తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించేటప్పుడు ఎదుర్కొన్నాను. ఆవేదన కలిగింది. 1995లో ‘సంకల్పం’ చిత్రంతో తెలుగులో పరిచయమయ్యాను.. 25ఏళ్లు దాటిపోయింది.. ఇప్పుడు తెలుగులో నాన్‌ లోకల్‌ అంటుంటే చాలా ఆవేదన కలుగుతోంది. కళాకారులకు భాష, ప్రాంతీయ భేదాలు ఉండవు. ఆర్టిస్టులు లోకల్‌ కాదు యూనివర్సల్‌. నా అసిస్టెంట్స్‌కి ఇళ్లు కొనిచ్చినప్పుడు నాన్‌ లోకల్‌ అనలేదే? గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు నాన్‌ లోకల్‌ అనలేదు. తెలుగులో తొమ్మిది నందులు, ఒక జాతీయ అవార్డు పొందినప్పుడూ నాన్‌ లోకల్‌ అనలేదు. మరిప్పుడు ఎందుకు నాన్‌ లోకలంటున్నారు? ఇలా మాట్లాడడం సంకుచితత్వం.

► సినిమాలతో బిజీగా ఉంటారు. ‘మా’ అధ్యక్షునిగా సమయం కేటాయించగలడా? అంటున్నారు. నాకున్న సమయంలో సినిమాల్లో నటిస్తా, ప్రొడక్షన్‌ చూసుకుంటా, వ్యవసాయం చేస్తా, కుటుంబాన్ని చూసుకుంటున్నా.. ఇవన్నీ చేయగలుగుతున్నప్పుడు అధ్యక్షుడిగా పని చేయలేనా? సమయం విలువ తెలిసినవాడికి పని చేయడానికి చాలా సమయం ఉంటుందని నమ్ముతాను. తప్పకుండా ‘మా’కు న్యాయం చేయగల సమర్థత నాకుంది. చేస్తాను.

ఈ సమావేశంలో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సభ్యులు శ్రీకాంత్, బెనర్జీ, తనీష్, ప్రగతి, అనసూయ, సన, అజయ్, నాగినీడు, సమీర్, ఉత్తేజ్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, సురేష్‌ కొండేటి, సుడిగాలి సుధీర్, గోవిందరావు, అదిరే అభి తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరు కాని ఇతర సభ్యులు జయసుధ, సాయికుమార్‌ తదితరులు వీడియో ద్వారా తమ సందేశాన్ని పంపారు.

అన్నయ్య ఆశీర్వాదాలున్నాయి
– నటుడు–నిర్మాత నాగబాబు
‘‘నాలుగేళ్లుగా ‘మా’ అసోసియేషన్‌ మసకబారింది. డిగ్నిటీ తగ్గింది. ఈసారి ‘మా’కు మంచి గుర్తింపు తీసుకురావాలని అనుకుంటున్నాం. ప్రకాశ్‌రాజ్‌ చేసే సేవల గురించి అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటే మరింత మంచి జరుగుతుందని నమ్మి, మద్దతు ఇస్తున్నాను. అన్నయ్య చిరంజీవి బ్లెసింగ్స్‌ కూడా మాకు ఉన్నాయి. ప్రకాశ్‌రాజ్‌ కూడా అన్నయ్యని అడిగినప్పుడు ‘‘మా’కు మంచి చేసే ఎవరికైనా సపోర్ట్‌గా ఉంటా, కానీ డైరెక్ట్‌గా ఇన్‌వాల్వ్‌ కాను’’ అన్నారు. ఇక్కడ వర్గ సమీకరణాలు, రాజకీయాలు లేవు. ఇక లోకల్, నాన్‌ లోకల్‌ అనేది అర్థరహితమైన వాదన. ‘మా’లో మెంబర్‌షిప్‌ ఉన్న ఎవరైనా అధ్యక్ష పదవి నుంచి ఈసీ మెంబర్‌ వరకూ ఏ పదవికైనా పోటీ చేయవచ్చు. మనం భారతీయ నటులం’’ అన్నారు.

మీడియాపై బండ్ల గణేశ్‌ వ్యంగాస్త్రాలు విసిరారు. విలేకరులు ప్రశ్నించగా... గణేశ్‌ ‘‘మీడియాని నేనెప్పుడూ విమర్శించను. కొందరు చేస్తున్నవాటిని ప్రస్తావించాను. అంతే.. ఎవరైనా బాధపడితే క్షమించమని కోరుతున్నాను. ‘మా’ విషయమై మమ్మల్ని చర్చా వేదికలకు పిలిచి ఇబ్బంది పెట్టొద్దని మీడియా మిత్రులను చేతులెత్తి వేడుకుంటున్నాను’’ అన్నారు నటుడు–నిర్మాత బండ్ల గణేశ్‌.

మంచు విష్ణు అధ్యక్ష పదవి బరిలో ఉన్న నేపథ్యంలో మీరు ఆ కుటుంబంతో ఏమైనా మాట్లాడారా? అనే ప్రశ్నకు ప్రకాశ్‌రాజ్‌ స్పందిస్తూ –‘‘ఎన్నికల్లో పోటీ చేసే విషయమై మూడు నెలల కిందట మోహన్‌బాబుగారితో మాట్లాడాను. అలాగే విష్ణుకి కూడా ఫోన్‌ చేసి మాట్లాడాను. అయితే పోటీ చేయొద్దని కాదు. ఎలాంటి అసహ్యాలూ లేకుండా ఈ ఎన్నికలు జరుపుకుందామని చెప్పాను’’ అన్నారు. అలాగే ‘‘జీవిత, హేమగార్లు కూడా ప్రశ్నించే మహిళలే.. పోటీ చేయడంలో తప్పులేదు. నా దృష్టిలో ఏకగ్రీవం అన్నది కరెక్ట్‌ కాదు.. పోటీ ఉన్నప్పుడే పని చేసేవారిని ఎన్నుకుంటారు’’ అని కూడా అన్నారాయ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top