
మలయాళ టాప్ హీరో మోహన్ లాల్ నటనకు ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల కూడా ప్రశంసలు కురిపిస్తారు. మరోసారి తనను భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమ నటుడిగా ఎందుకు భావిస్తున్నారో నిరూపించుకున్నారు. తాజాగా ఆయన నటించిన బంగారు ఆభరణాల ప్రకటన నెట్టింట వైరల్ అవుతుంది. సాధారణంగా బంగారు అభరణాలకు సంబంధించిన యాడ్స్లలో హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తారు. అయితే, ఈ దిగ్గజ నటుడు కనీసం ఒక్క డైలాగ్ కూడా లేకుండా ప్రేక్షకులను మెప్పించాడు. కేవలం తన నటనతోనే ఆశ్చర్యపరిచాడు. ఈ వాణిజ్య ప్రకటనలో పూర్తిగా అతని కళ్ళు, హావభావాలు మాత్రమే పలికించాడు. అదరహో అనిపించేలా మోహన్ లాల్ కనిపిస్తాడు.
'తుడరుమ్' చిత్రంలో మోహన్ లాల్తో కలిసి నటించిన, ప్రఖ్యాత యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రకాష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ వాణిజ్య ప్రకటన 110 సెకన్ల నిడివితో ఉంది. మోహన్ లాల్ కారు దిగగానే.. సెట్లో ఉన్న ప్రకాష్ స్వాగతం పలుకుతాడు. 'మేము దీనిని ఫ్యాషన్ ఫోటోగ్రఫీ శైలిలో చిత్రీకరించాము' అంటూ మోడల్ శివానీని మోహనల్లాక్కు పరిచయం చేస్తాడు. యాడ్ కోసం ఆమె ధరించిన వజ్రాల ఆభరణాన్ని ఎవరికీ చెప్పకుండా మోహన్ లాల్ తీసుకుని తన వానిటీ వ్యాన్లోకి తీసుకెళ్తాడు. అద్దం ముందు నిలబడి తన మెడలో వజ్రాల అభరణాన్ని ఆయన ధరిస్తాడు. ఆ సమయంలో ఆయన పలికించే హావభావాలు అందరినీ ఆకట్టుకుంటాయి.
ఇలా కేవలం మోహన్‌లాల్ మాత్రమే నటించగలరని నెటిజన్లు అభినందిస్తున్నారు. నగలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలలో హీరోయిన్లే కనిపించాలా ఏంటి...? అంటూ మరోకరు చెప్పుకొచ్చారు. ఇలా స్త్రీ హావభావాలు పలికించడం చాలా కష్టం.. కానీ, మోహన్‌లాల్ చాలా సులువుగా మెప్పించారు. దటీజ్ మోహన్‌లాల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అందుకే ఆయన జాతీయ నటుడు అయ్యారు అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు.