ఒంగోలును తాకిన ‘స్వాతి కిరణం’

Memories Of Legendary Director Kviswanath  - Sakshi

పాపం పుణ్యం తెలియని ఓ అమాయకుడు నాటి మూఢ నమ్మకాలకు బలవుతున్న ఓ వితంతువు మెడలో తాళి కడతాడు. అదీ సీతారాముల కల్యాణోత్సవంలో, రాముల వారు కట్టాల్సిన తాళిని. ఈ ఒక్క సీన్‌ స్వాతిముత్యం కథలోని ఆత్మని ఘాడంగా ఎలివేట్‌ చేస్తుంది.. 

తాను సంగీత సామ్రాట్‌ని అని విర్రవీగే గురువు ఆత్మాభిమానాన్ని గౌరవించేందుకు పదేళ్ల బాలుడు ఆత్మత్యాగం చేస్తాడు. ఇది స్వాతికిరణం అనే మహాకావ్యంలో పేద తల్లిదండ్రులు.. గురువు భార్య పడే ఆవేదన ప్రేక్షకుల గుండెల్ని పిండి చేసి.. కన్నీటి ధారలు కారుస్తుంది.. ఒకటా రెండా ఇలాంటి సున్నితమైన అంశాలతో కళాఖండాలు సృష్టించిన కళా తపస్వి భౌతికంగా దూరమైనా.. ఎప్పటికీ సినీ వినీలాకాశంలో ధ్రువతారగా మెరుస్తూనే ఉంటారు. సినీ దర్శకుడు కె. విశ్వనాథ్‌కు ఒంగోలుతో ఎనిలేని బంధం ఉంది.  


అక్కినేని కళాపరిషత్‌ ఆధ్వర్యంలో స్వర్ణకంకణ సన్మాన కార్యక్రమంలో.. ( ఫైల్‌) 

ఒంగోలు టౌన్‌: తెలుగు సినీ రుచిని ప్రపంచానికి చూపించిన కళాతపస్వి కె. విశ్వనాథ్‌ మృతితో ఒంగోలులోని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగి పోయారు. అయితే ఆ మహా రుషి ఒంగోలులో పర్యటించడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయనతో తమకున్న పరిచయాన్ని, అనుబంధాన్ని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. నలభై సంత్సరాల క్రితం 1980 ఫిబ్రవరి 2న ఆయన దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విడుదలైన రోజునే ఆయన నిష్కృమించడం కాకతాళీయం. 


శ్రీనళిని ప్రియ నృత్య నికేతన్‌ వార్షికోత్సవంలో పాల్గొన్న మహా దర్శకుడు ( ఫైల్‌) 

కాగా నాడు శంకరాభరణం సినిమా విడుదలైన సందర్భంగా నటీనటులతో కలిసి విశ్వనాథ్‌ తొలిసారిగా ఒంగోలు వచ్చారు. పాతికేళ్ల తరువాత 2015 జూలై 4న ఒంగోలులోని శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్‌ ప్రథమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్వాహకులు హోటల్‌ సరోవర్‌లో వసతి సౌకర్యం కలి్పంచారు. కానీ ఎంతో నిష్టగా ఉండే ఆయన హోటల్‌ భోజనం తినేందుకు ఇష్టపడలేదు. అన్నవరప్పాడులోని పోతురాజు కాలనీలో నివాసం ఉండే నృత్య కళాశాల నిర్వాహకురాలు యస్‌వీ శివకుమారి ఇంటికి వెళ్లి భోజనం చేశారు. మరుసటి రోజు గుంటూరులో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున రెండో రోజు కూడా ఆయన ఒంగోలులోనే గడిపారు. 

విశ్వనాథ్‌ అంతటి విఖ్యాత దర్శకుడు తమ ఇంటికి రావడం అదృష్టం అని, ఆయన మృతిని జీరి్ణంచుకోలేక పోతున్నామని శివకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2016లో ఆయనకు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అక్కినేని కళాపరిషత్‌ నిర్వాహకులు కల్లంగుంట కృష్ణయ్య ఆధ్వర్యంలో స్వర్ణకంకణంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఒంగోలుకు వచ్చారు. ఆ సందర్భంగా నగరంలోని ముంగమూరు రోడ్డులో గూడ రామ్మోహన్‌ నిర్వహిస్తున్న శ్రీ ఆదిశంకరా వేద పాఠశాలను సందర్శించారు. అక్కడి వేద విద్యార్థులతో వేదాలు, బ్రాహ్మణత్వం గురించి చర్చించారు. వేద విద్యార్థులకు వ్రస్తాలను బహూకరించారు.

 బ్రాహ్మణుడినై పుట్టి వేద విద్యను అభ్యసించలేక పోయాను అంటూ పండితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు రామ్మోహన్‌ గుర్తు చేసుకున్నారు. ఇలా ఒంగోలులోని కళాకారులతో, సంస్థలతో ఆయనకు అనుబంధం ఉంది. ‘రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు’ అన్న మహాకవి గుర్రం జాషువ వాక్యాలు విశ్వనాథ్‌ విషయంలో అక్షరాలా నిజమయ్యాయి. ఒంగోలు ముంగమూరు రోడ్డులోని డాక్టర్‌ దారా రామయ్య శా్రస్తికి విశ్వనాథ్‌తో చిరకాల స్నేహం ఉందని ఆయన కూతురు, చిత్రకారిణి  సి.హెచ్‌.శ్రీలక్ష్మి చెప్పారు. తాను గీసిన కృష్ణం వందే జగద్గురు చిత్రానికి వచ్చిన మిరాకిల్‌ బుక్‌ ఆఫ్‌ ఇండియా అవార్డు, తెలుగు బుక్‌ ఆఫ్‌ అవార్డులను విశ్వనాథ్‌ చేతుల మీదుగా తీసుకున్నానని చెప్పారు. 

సంప్రదాయ సంకెళ్లు తెంచిన విశ్వనాథుడు
ఒంగోలు టౌన్‌: కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మృతికి రంగభూమి కళాకారుల సంఘం ఘనంగా నివాళి అరి్పంచింది. స్థానిక సీవీఎన్‌ రీడింగ్‌ రూంలో విశ్వనాథ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళరి్పంచారు. సామాజిక సందేశంతో నిర్మించిన ఆయన సినిమాలు తెలుగు ప్రజల సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాయని పడమటి గాలి ఫేం పాటిబండ్ల ఆనందరావు అన్నారు. సంప్రదాయ సంకెళ్లను తెంచిన సాంస్కృతిక విప్లవకారుడు విశ్వనాథ్‌ మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. నగరానికి చెందిన కవులు, కళాకారులు  ప్రసాద్, ఏ.ప్రసాద్, వాకా సంజీవరెడ్డి, గుర్రం కృష్ణ, తాళ్లూరి శ్రీదేవి, చల్లా నాగేశ్వరమ్మ, నల్లమల్లి పాండురంగనాథం, ఎస్కే బాబు, పొన్నూరి వెంకట శ్రీనివాసులు, కె.రాఘవులు తదితరులు విశ్వనాథ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

స్ఫూర్తినిచ్చిన విశ్వనాథ్‌ సినిమాలు 
సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విశ్వనాథ్‌ సినిమాలను చూస్తూ పెరిగా. మానవ సంబంధాలు, నైతిక పునాదులపై ఆయన సినిమాలు చర్చించేవి. సమాజం పట్ల బాధ్యతను తెలిపే ఆ సినిమాల ప్రభావంతో విదేశాల్లో ఉద్యోగాన్ని వదిలి ఒంగోలులో నృత్య కళాశాలను ఏర్పాటు చేశా. ఎంతోమంది చిన్నారులకు కూచిపూడిలో శిక్షణ ఇస్తున్నా. మా కళాశాల ప్రథమ వార్షికోత్సవానికి ఆయన ఒంగోలుకు రావడం, తండ్రిలా మా ఇంటికి భోజనం చేయడం ఎన్నటికీ మరిచిపోలేను. ఆయన మరణం కళాకారులకు తీరని లోటు.
– యస్‌వీ శివకుమారి, శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్, ఒంగోలు  

మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నా సినిమాలు చూస్తే పిల్లలు పాడైపోతారని పెద్దలు మందలించే వారు. అలాంటి పరిస్థితి నుంచి స్వయంగా పెద్దలే తమ పిల్లలను విశ్వనాథ్‌ సినిమాలు చూడమని ప్రోత్సాహించేలా ఆయన కళాఖండాలు రూపొందించారు. విశ్వనాథ్‌ మృతి తెలుగు సినిమా రంగానికే కాదు, తెలుగు ప్రజలందరికీ తీరని లోటు. ఆయన వారసత్యాన్ని కొనసాగించే దర్శకులు నేడు ఒక్కరు కూడా కనిపించకపోవడం విచారకరం.  
– కల్లకుంట కృష్ణయ్య, అక్కినేని కళాపరిషత్, ఒంగోలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top