మంచి రోజులు ముందున్నాయి

Megastar Chiranjeevi Birthday 2020 Common DP - Sakshi

స్టార్‌ హీరోల పుట్టినరోజంటే హంగామా, సందడి అంతా వేరు. సామాజిక సేవా కార్యక్రమాలు, కేక్‌ కటింగ్‌ వేడుకలు సర్వసాధారణం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సామూహికంగా పాల్గొనే కార్యక్రమాలు నిర్వహించడం కరెక్ట్‌ కాదని వాయిదా వేస్తున్నారు. అయితే అభిమానాన్ని సోషల్‌ మీడియా వేదికగా చూపిస్తున్నారు. సంబరాలన్నీ ఇంటర్నెట్‌ సాక్షిగా జరుపుకుంటున్నారు.

ఓ స్టార్‌ హీరో బర్త్‌డే అంటే ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన సీడీపీ (కామన్‌ డిస్‌ప్లే పిక్చర్‌), మరియు హ్యాష్‌ట్యాగ్‌ విడుదల చేసి, ఆ సీడీపీనే తమ అకౌంట్స్‌ పిక్చర్స్‌గా మార్చుకుని ఆ ట్యాగ్‌ను ఉపయోగించి తమ ప్రేమను సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తుంటారు. ఈ ఏడాది చిరంజీవి బర్త్‌డే కామన్‌ డీపీను సుమారు వందమంది సెలబ్రీటీలతో విడుదల చేయిస్తున్నారు. వంద మందికి పైగా సెలబ్రీటీలు కామన్‌ డీపీను విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ సీడీపీ విడుదల చేసే వారిలో చిరుతో నటించినవారి దగ్గర నుంచి యంగ్‌ యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్‌ అందరూ ఉన్నారు.

ఇది తాత్కాలిక కష్టమే
‘‘సినిమా షూటింగ్స్‌ ఇంకా మొదలు కాలేదు.. ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి. పని లేక,  చేతిలో డబ్బు లేక సినీ కార్మికుల పరిస్థితి కష్టంగా ఉంది. అందుకే ‘కరోనా క్రైసిస్‌ చారిటీ’(సీసీసీ) తరపున మూడోసారి కూడా కార్మికులకు నిత్యావసర వస్తువులు ఇవ్వాలని నిర్ణయించుకుని, ఇప్పటికే పంపిణీ మొదలుపెట్టాం’’ అని హీరో చిరంజీవి అన్నారు. సీసీసీ మూడో విడత నిత్యావసర సరుకుల పంపిణీ సమావేశాన్ని శుక్రవారం  హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి చిరంజీవి ఓ వీడియో షేర్‌ చేశారు.

‘‘హైదరాబాద్‌లోని అన్ని అసోసియేషన్లు , యూనియన్లు, సినీ జర్నలిస్టులతో పాటు ఆంధ్రాలో ఉన్న సినీ వర్కర్స్‌కి ఎప్పటిలాగా ఇస్తాం. అలాగే రెండు రాష్ట్రాల్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ లోని రెప్రజంటేటివ్‌లకు, పోస్టర్‌ అతికించే కార్మికులకు కూడా అందివ్వాలని నిర్ణయించాం. ఇప్పుడున్న ఈ పరిస్థితి శాశ్వతం కాదు.. తాత్కాలిక కష్టమే. మంచి రోజులు ముందున్నాయి. పని చేసుకొంటూ సంతోషంగా గడిపే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కి, మామూలు పరిస్థితులు నెలకొనాలని ఆ వినాయకుడికి మొక్కుదాం’’ అన్నారు. ఈ సమావేశంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శంకర్, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, దర్శకుడు మెహర్‌ రమేశ్, నటుడు బెనర్జీ తదితరులు మాట్లాడారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top