Major Movie: 'మేజర్‌' బయోపిక్‌లో అన్ని చూపించలేరు.. సందీప్‌ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Major Sandeep Unni Krishnan Father About His Son Biopic - Sakshi

26/11 ఉగ్రదాడుల సమయంలో ముంబైని రక్షించడంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన ధైర్యవంతులలో దివంగత మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఒకరు. మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం నుంచి ప్రేరణ పొంది తీసిన బయెపిక్‌ 'మేజర్' సినిమాతో టాలీవుడ్‌ హీరో అడవి శేష్ బాలీవుడ్‌లో అరంగ్రేటం చేయనున్నారు. నవంబర్‌ 26, 2008 (26/11) ముంబైలో జరిగిన ఉగ్రదాడితో ప్రపంచం మొత్తం వణికిపోయిన సంగతి విదితమే. భారత్‌తో పాటు 14 దేశాలకు చెందిన మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మారణ హోమం జరిగి గురువారానికి 13 ఏళ్లు అయింది.  ఈ సందర్భంగా మేజర్‌ సందీప్ తల్లిదండ్రులైన ఇస్రో రిటైర్డ్‌ అధికారి కె. ఉన‍్ని కృష్ణన్‌, ధనలక్ష్మీ ఉన్ని కృష్ణన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

సందీప్‌లా చిత్రీకరించలేరు..
'తమ కుమారుడిపై బయోపిక్‌ తీస్తామని చాలా మంది వాగ్దానాలు చేశారు. కానీ ఎవరు తీయలేదు. మొదట్లో అడవి శేష్‌ మా వద్దకు వచ్చినప్పుడు బయోపిక్‌ తీస్తామంటే ఒప్పుకోలేదు. మేజర్‌ చిత్రంలో తమ కుమారుడి పాత్రను అడవి శేష్ పోషిస్తామనడంతో ఒప‍్పుకున్నాం. ఇంకా చిత్రంపై ఎలాంటి అభిప్రాయం లేదు. సినిమా చూసిన తర్వాతే అభిప్రాయాన్ని చెప్పగలను. నేను వారి పనితీరు చూశాను. అడవి శేష్‌ కంటే శశికిరణ్ మీదే నాకు నమ్మకం ఎక్కువ. అతను ఇక్కడ ఉంటే బాగుండేది. సినిమా చూశాక 100 శాతం సర్టిఫికేట్‌ ఇస్తా. షూటింగ్ పూర్తయింది. విడుదల తేది కూడా ఖరారైంది. నేను సందీప్‌ తండ్రిని. సందీప్‌ను చూశాను. అతని విమర్శకుడిని నేను. నాకు సందీప్‌ గురువు. సందీప్‌ను అతనిలా చిత్రీకరించలేరని అనుకుంటున్నాను. అది సాధ‍్యం కాదు. ఆ విషయానికొస్తే ఏ బయోపిక్‌ అయినా 100 శాతం పూర్తిగా చూపించలేరు. ఎంతవరకూ చూపించారనేదే మనం ఆలోచించాలి. నేను వారి ప్రయత్నాన్ని విమర్శించడం లేదు. శేష్‌ చాలా నిజాయితీపరుడు. కానీ సందీప్‌ను ప్రతిబింబించేలా నటించగలడో లేదో తెలియదు.' అని సందీప్‌ తండ్రి ఉన్ని కృష్ణన్‌ తెలిపారు.   

వారు కూడా నా కుటుంబమే..
మేజర్‌ సినిమా 26/11 ఘటన గురించి మాత్రమే కాదు, మేజర్‌ ఉన్న కృష్ణన్‌ జీవితం, అతని వ్యక్తితం గురించి అని హీరో అడవి శేష్‌ పేర్కొన్నారు. 'ఈ దాడి జరిగినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. ఈ ఘటన గురించి టీవీలో చూశాను. అప్పుడు మేజర్‌ సందీప్‌ ఫొటోలు చూసి, అతను ఎవరా అని షాక్ అయ్యాను. 31 ఏళ్ల వయసులో తన ప్రాణాలను త్యాగం చేసినందుకు నేను చాలా ఆశ్చర్యపోయాను. అతను మన కుటుంబంలో వ్యక్తిలా కనిపించాడు. కరోనా మహమ్మారి కారణంగా సినిమా చిత్రీకరణకు చాలా సమయం పట్టింది. ఈ సమయాన్ని మేజర్‌ పాత్రను బాగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడింది. మేజర్ సందీప్‌ తల్లిదండ్రులతో మంచి బంధం ఏర్పడింది. మేము  ఏదో షూటింగ్‌ కోసం కలిశామన్న సంగతి మర్చిపోయాం. మేము ఇప్పుడు సొంత బంధువులం అయ్యాం.' అని అడవి శేష్‌ చెప్పుకొచ్చారు. 

'సినిమా తర్వాత ఏం జరుగుతుంది. విడుదల తర్వాత మమ్మల్ని మర్చిపోతావు' అని అంకుల్‌ తనను తరచుగా అడిగేవాడని అడవి శేష్‌ తెలిపారు. వారికి తాను ఎప్పుడు అండగా ఉంటానని, అది కుడా తన కుటుంబమే అని, ప్రాథమిక బాధ‍్యత అని పేర్కొన్నారు. మేజర్‌ సినిమా ఫిబ్రవరి 11, 2022న తెలుగు, మళయాలం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇందులో సాయి మంజ్రేకర్‌, శోభితా ధూలిపాళ, రేవతి, ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు నటించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top