మందాకినితో పాట పాడుతూ చిందేస్తున్నారు రుద్ర. ఈ పాట పూర్తవగానే విలన్స్‌ను చితక్కొడుతూ, రుద్రతాండవం చేస్తారట రుద్ర. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచరస్ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలోని రుద్ర పాత్రలో మహేశ్‌బాబు (ముప్పై నిమిషాల పాటు రాముడిగానూ కనిపిస్తారు), మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్‌లో మహేశ్‌బాబు, ప్రియాంకలపై పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాట చిత్రీకరణ పూర్తి కాగానే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్‌ని ఆరంభించనున్నారట. దాదాపు నెలరోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో ప్రధానంగా యాక్షన్ సీక్వెన్స్‌నే చిత్రీకరిస్తారని సమాచారం. ఈ ఫైట్ కోసమే మహేశ్‌బాబు విదేశాల్లో శిక్షణ తీసుకున్నారని తెలిసింది. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ప్రియాంకా చోప్రా కూడా పాల్గొంటారట. అలాగే ఈ ఏడాది ఆగస్టుకల్లా ‘వారణాసి’ షూటింగ్‌ను పూర్తి చేయాలనే టార్గెట్‌గా పెట్టుకున్నారట రాజమౌళి. కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.


