
ఒక్కోసారి అనుకున్నవి అనుకున్న సమయంలో జరగవు. అందుకు కారణాలు చాలానే ఉంటాయి. కొన్ని పరిస్థితులను బట్టి మారుతుంటాయి. ఖైదీ–2 చిత్ర విషయంలోనూ ఇదే జరుగుతోంది. కార్తీ కథానాయకుడిగా నటించిన చిత్రం ఖైదీ. ఇది లోకేష్‌కనకరాజ్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం. 2019లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఖైదీకి సీక్వెల్ ఉంటుందని నిర్మాతలు అప్పుడే వెల్లడించారు. అయితే ఆరేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఖైదీ–2 చిత్ర ప్రారంభానికి ముహూర్తం పడలేదు. ఇందుకు ప్రధాన కారణం లోకేష్ కనకరాజ్ అనే చెప్పవచ్చు. ఈయన వరుసగా స్టార్ హీరోలతో చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కించిన కూలీ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత ఖైదీ–2 చిత్రం ఉంటుందని లోకేష్ కనకరాజ్ అన్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన కమలహాసన్, రజనీకాంత్ హీరోలుగా ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఖైదీ–2 చిత్ర నిర్మాణం వాయిదా పడిందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్తీ ఖైదీ–2 కోసం కేటాయించిన కాల్‌షీట్స్‌ను దర్శకుడు సుందర్.సికి కేటాయించినట్లు తాజా సమాచారం. సుందర్.సి, నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మూకుత్తి అమ్మన్–2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రం పూర్తయిన తర్వాత కార్తీ హీరోగా చిత్రం చేయనున్నట్లు సమాచారం. కార్తీ ప్రస్తుతం సర్దార్–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా మార్షల్ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. కల్యాణి ప్రియదర్శన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి తమిళ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత సుందర్ సి నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.