
‘హుడియో హుడియో...’ అంటూ శ్రీలీలతో ఆడి పాడుతున్నారు రవితేజ. భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్‌లైన్. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ– హీరోయిన్ శ్రీలీల కలిసి ‘మాస్ జాతర’ లో రెండోసారి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31 విడుదల కానుంది.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘హుడియో హుడియో...’ అంటూ సాగే పాట ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. ‘నా గుండె గాలిపటమల్లే ఎగరేశావే... నీ సుట్టు పక్కల తిరిగేలా గిరి గీశావే... నా కంటి రెమ్మల్లో కలలకు ఎరవేసావే... నీ కంటి చూపులతో కలలను ఉరితీశావే...’ అంటూ ఈ పాట సాగుతుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ పాడిన ఈ పూర్తి పాట బుధవారం విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: విధు అయ్యన్న, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె.వర్మ.