
ఇప్పుడు నటీనటులు ఒక్క భాషలో నటిస్తే చాలు. ఇతర భాషల్లోనూ ఇట్టే ఛాన్సులు అందిపుచ్చుకుంటున్నారు. అలా ఇతర భాషల్లోనూ అవకాశాలు పొందుతూ తమ సత్తాను చాటుకుంటున్నారు. అలా కోలీవుడ్‌లో పాగా వేయాలని ఆశపడుతున్న టాలీవుడ్ నటి కోమలి ప్రసాద్(Komalee Prasad). పదహారణాల తెలుగు అమ్మాయి అయినా ఈమె ప్రతిభ పాటవాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కోమలి ప్రసాద్‌లో నటి మాత్రమే కాకుండా ఒక వైద్యురాలు (డెంటిస్ట్), జాతీయస్థాయి అథ్లెట్, క్లాసికల్ నృత్య కళాకారిణి అంటూ పలు రంగాల్లో ప్రతిభ కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈమె రాష్ట్ర స్థాయి కోకో క్రీడాకారిణి. బ్యాడ్మింటన్ కళాకారిణి కూడా. విశ్వవిద్యాలయం స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడల్లో బంగారు పతకాలను గెలుచుకున్న క్రీడాకారిణి.
ఇప్పటికే తెలుగులో నెపోలియన్,హిట్2, రౌడీ బాయ్స్, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి వంటి పలు చిత్రాల్లో నటించిన కోమలి ప్రసాద్ తాజాగా నాని కథానాయకుడిగా నటించిన హిట్–3 చిత్రంలో ఏఎస్పీ వర్షాగా చాలా కీలక పాత్రలో నటించి అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. ఈ చిత్రంలో నటించిన అనుభవాలను కోమలి ప్రసాద్ పంచుకుంటూ హిట్–3 చిత్రంలో తాను పోషించిన ఎస్పీ వర్షా పాత్ర శారీరకంగానూ, మానసికంగానూ చాలెంజ్ అనిపించిందన్నారు. ఈపాత్ర కోసం జాతీయస్థాయి బాక్సర్ అనిల్ వద్ద శిక్షణ పొందినట్లు చెప్పారు. తన పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణకు ఆనంద భాష్పాలు వచ్చాయన్నారు.

ఈ చిత్రంలో నానితో కలిసి నటించడం మంచి అనుభవం అని, ఆయన చాలా సలహాలు, సూచనలు ఇచ్చారని చెప్పారు. అదేవిధంగా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథా చిత్రంలోనూ నటించాలన్నది తన కలగా పేర్కొన్నారు. తమిళ చిత్రాలపై ఆశతో తమిళభాషను సరళంగా మాట్లాడడం నేర్చుకున్నానని చెప్పారు. సి. ప్రేమ్‌కుమార్, ఆల్ ఫోన్స్ పుత్తిరన్, మణికంఠన్, గౌతమ్‌మీనన్ వంటి దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు, అజిత్ ఎప్పటికీ తన ఫేవరెట్ అని, ఆయనతో కలిసి నటించాలని కోరుకుంటున్నట్లు కోమలి పేర్కొన్నారు.