'హనుమాన్‌' రెమ్యునరేషన్ విషయంలో గొడవలు.. ప్రశాంత్‌ వర్మ పోస్ట్‌ వైరల్‌ | Sakshi
Sakshi News home page

'హనుమాన్‌' రెమ్యునరేషన్ విషయంలో గొడవలు.. ప్రశాంత్‌ వర్మ పోస్ట్‌ వైరల్‌

Published Fri, Feb 9 2024 1:30 PM

HanuMan Director Prasanth Varma Post On Clashes With Producer - Sakshi

ఈ సంవత్సరం సంక్రాంతి హిట్‌గా 'హనుమాన్' చిత్రం నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై  రూ.300 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. తక్కువ బడ్జెట్‌లో డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ అద్భుతంగా తెరకెక్కించారు. హనుమాన్‌ విజువల్స్‌ చూస్తే అందుకు అయిన ఖర్చు రూ. 100 కోట్లు ఉంటుందేమో అని ఎవరైనా చెప్తారు. కానీ కేవలం రూ. 50 కోట్లతో ఈ సినిమాను క్రియేట్‌ చేశారు ప్రశాంత్‌ వర్మ. ఈ సినిమా కోసం నిర్మాత నిరంజన్‌ రెడ్డి కూడా తన వంతుగా ఎంత చేయాలో అంత చేశారని గతంలో ప్రశాంత్‌ కూడా తెలిపారు.

కొద్దిరోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం చక్కర్లు కొడుతోంది. సినిమా భారీ కలెక్షన్స్‌ రాబట్టడంతో  నిర్మాత, దర్శకుడి మధ్య గొడవలు వచ్చాయని వార్తలు వచ్చాయి. హనుమాన్‌కు వచ్చిన లాభాల్లో వాటా కావాలని నిర్మాతతో ప్రశాంత్‌ గొడవ పడ్డారని పలు వెబ్‌సైట్స్‌లలో ప్రచారం జరిగింది. రూ.30 కోట్లు తనకు షేర్‌గా ఇవ్వాలని నిర్మాతపై ఆయన ఒత్తిడి తెస్తున్నారంటూ పుకార్లు వచ్చాయి.

(ఇదీ చదవండి : సినిమా ఛాన్సులు లేవు.. కానీ భారీగా సంపాదిస్తున్న హీరోయిన్‌)

అంతే కాకుండా ఈ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న 'జై హనుమాన్‌'కు సంబంధించి కొంత అడ్వాన్స్‌తో పాటుగా లాభాల్లో వాటా కావాలని ముందే ఆయన అడిగినట్లుగా వైరల్‌ అయింది. తన షరతులను ఒప్పుకోకపోతే సీక్వెల్‌ కోసం పనిచేయనని ప్రశాంత్‌ వర్మ చెప్పినట్లు పలు రకాలుగా వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తన ఎక్స్‌ పేజీలో ఒక పోస్ట్‌ చేశారు. నిర్మాత నిరంజన్‌ రెడ్డితో ప్రశాంత్‌ కలిసి దిగిన ఒక ఫోటోను షేర్‌ చేశారు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఫోన్‌ చూసుకుంటూ సరదాగా ఉన్నారు. తమపై వస్తున్న నెగెటివిటీని తీసిపడేస్తూ నవ్వుకుంటున్నట్లు అందులో రాసుకొచ్చారు. తాము హనుమాన్‌ స్పిరిట్‌ను కొనసాగిస్తున్నామని ప్రశాంత్‌ వర్మ తెలిపారు. ఒక్క పోస్ట్‌తో తమ మధ్య గొడవలు ఉన్నాయని వస్తున్న పుకార్లకు ఆయన చెక్‌ పెట్టేశారని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇంత చక్కగా ఉన్న వీరిద్దరి మధ్య ఇలాంటి వార్తలో చిచ్చు పెట్టాలని ఎవరు ప్రయత్నం చేశారో తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement