యోధుడిగా శత్రువులతో వీరోచిత పోరాటం చేస్తున్నారు గోపీచంద్. ఈ యోధుడి శూరత్వం ఏ రేంజ్‌లో ఉంటుందనేది సిల్వర్ స్క్రీన్‌పై చూడాలి. గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ కెరీర్‌లోని ఈ 33వ సినిమాను పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు.
‘‘విభిన్నమైన కథతో భారతదేశ చరిత్రలోని ఓ ప్రముఖ అధ్యాయాన్ని వెండితెరపైకి తీసుకువస్తున్నాం. గోపీచంద్ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఓ విభిన్నమైన పాత్రను ఈ సినిమాలో చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు షెడ్యూల్స్‌లో 55 రోజుల షూటింగ్‌ను పూర్తి చేశాం. ప్రస్తుతం వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంట్రవెల్ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నాం. ఈ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమా కథ 7వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుందని, ఈ చిత్రానికి ‘శూల’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు సంగీతం: అనుదీప్ దేవ్, కెమెరా: సౌందర్ రాజన్.


