రేంజ్‌ రోవర్‌ గిఫ్ట్‌.. ప్రభాస్‌లా ఎవరూ చేయరు : ‘బుజ్జిగాడు’ నటి | Bujjigadu Actress Sanjana Interesting Comments On Prabhas | Sakshi
Sakshi News home page

రేంజ్‌ రోవర్‌ గిఫ్ట్‌.. ప్రభాస్‌లా ఎవరూ చేయరు : ‘బుజ్జిగాడు’ నటి

May 10 2026 2:38 PM | Updated on May 10 2026 4:05 PM

Bujjigadu Actress Sanjana Interesting Comments On Prabhas

ప్రభాస్ మంచితనం గురించి, దానగుణం గురించి అందరికి తెలిసిందే. వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభాస్‌ కనబర్చే దాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంతేకాదు ఆయన చుట్టు ఉన్నవాళ్ల కోసం కూడా ఆయన ఏదో రకంగా సహాయం చేస్తూనే ఉంటాడని ప్రభాస్‌ని దగ్గర నుంచి చూసిన వాళ్లు చెబుతుంటారు. 

ఇక ఆయనతో కలిసి నటించిన వారైతే ఆయన పెట్టే భోజనం గురించి కచ్చితంగా మాట్లాడతారు. షూటింగ్‌ సమయంలో అవకాశం ఉన్నప్పుడల్లా అందరికి భోజనాలు పెట్టించడం ప్రభాస్‌కి చాలా ఇష్టం. అందుకే పలువురు స్టార్స్‌  ప్రభాస్‌ భోజనం గురించి చెబుతూ.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తారు. అయితే ప్రభాస్‌ చేసే సహాయాల్లో చాలా వరకు బయటకు తెలియవని చెబుతోంది నటి  సంజన గల్రానీ. ఈ బ్యూటీ ‘బుజ్జిగాడు’లో ప్రభాస్‌కి మరదలుగా నటించింది. తాజాగా ఓ న్యూస్‌ ఛానల్‌ నిర్వహించే టాక్‌ షోలో పాల్గొన్న సంజనా.. ప్రభాస్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది.

‘బాహుబలి తర్వాత ప్రభాస్‌ చాలా ఎదిగిపోయాడు. ఆయనను చూస్తే ఏ అమ్మాయి అయినా.. అలా ఉండిపోతుంది. ఎత్తు, పర్సనాలిటీ అలా ఉంటుంది మరి. మనిషి మాత్రమే కాదు ఆయన మనసు కూడా చాలా మంచింది. తన జిమ్‌ ట్రైనర్‌కి రేంజ్‌ రోవర్‌ కారునే గిఫ్ట్‌గా ఇచ్చాడని విన్నాం. ఇలా ఎవరు చేస్తారు? బ్యాంక్‌ అకౌంట్‌లో అందరికీ డబ్బులు ఉంటాయి. కానీ ఎవరికైనా ఎలాంటి ఫలితం ఆశించకుండా సాయం చేయాలంటే గుండెల్లో దమ్ముండాలి. అది ప్రభాస్‌లో ఉంది. ఆయనది చాలా పెద్ద మనసు.

 ఆయన చేసిన సహాయాల్లో మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. తెలియకుండా చాలా మందికి సహాయం చేశాడు. నటుడిగా చాలా కష్టపడతాడు. అందుకే సక్సెస్‌ అయ్యాడు. ఆయన ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఆయనతో టచ్‌లో లేను. కానీ స్పిరిట్‌ కోసం చాలా ఎదురు చూస్తున్నా. ఫస్ట్‌డే ఫస్ట్‌ షోకి ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తా’ అని సంజనా చెప్పుకొచ్చింది. 

కాగా, 2020లో తన జిమ్‌ ట్రైనర్‌ లక్ష్మణ్‌ రెడ్డికి ప్రభాస్‌ రేంజ్‌ రోవర్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆయన సినీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘బాహుబలి’. ఇందులో ప్రభాస్‌ సిక్స్‌ప్యాక్‌లో కనిపించడం వెనుక లక్ష్మణ్‌ శ్రమ ఉంది. అందుకే ప్రభాస్‌ ఖరీదైన కారుని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అప్పట్లో దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

 

Advertisement
 
Advertisement
Advertisement