బిగ్‌బాస్‌: చీపురుతో చిత‌క్కొట్టిన గంగ‌వ్వ‌

Bigg Boss 4 Telugu: BB TV Skit Was Entertainment Bomb - Sakshi

బిగ్‌బాస్ షోలో కాస్త సంద‌డి మొద‌లైంది. కంటెస్టెంట్లు అన‌వ‌స‌ర విష‌యాల‌కు కొట్టుకోవ‌డం మానేసి టాస్క్‌లో పూర్తిగా లీన‌మైపోయారు. ఒక‌రిని మించి మ‌రొక‌రు ప‌ర్ఫార్మెన్స్‌ల‌తో అద‌ర‌గొట్టారు. కానీ అబ్బాయిలను మించిపోయేలా, ప్రేక్ష‌కులు మైమ‌రిచిపోయేలా హారిక డ్యాన్స్‌, దివి న‌ట‌న‌, దేవి కామెడీ అద్భుతహ అనిపించాయి. అభిజిత్‌, మోనాల్ ప‌ర్స‌న‌ల్ విష‌యాలు మాట్లాడుకోగా అఖిల్ మోనాల్‌కు తినిపించాడు. మ‌రి నేటి ఎపిసోడ్‌లో ఇంకేమేం జ‌రిగాయో చూసేద్దాం..

నాతో మాట్లాడ‌తాన‌ని ప్రామిస్ చెయ్యు: అభిజిత్‌
అభిజిత్ వ‌ద్ద‌న్నా గారాబం చేస్తూ అత‌నికి గోరు ముద్దలు పెడుతూ అదే ప్లేటులో హారిక‌ కూడా భోజ‌నం చేసింది. ఇక‌ ఇంటి స‌భ్యులు పాట పాడుతుంటే అమ్మ రాజ‌శేఖ‌ర్‌, క‌రాటే క‌ళ్యాణి డ్యాన్సు చేయ‌బోయారు. ఇంత‌లో మాస్ట‌ర్ ద‌డేలుమ‌ని కింద ప‌డిన‌ట్లు న‌టించడంతో ప‌డీప‌డీ న‌వ్వారు. ఈ ఘోరాన్ని చూడ‌లేక అరియానా రెండు క‌ళ్లు మూసుకుంది. నాకు ముగ్గురు గ‌ర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవార‌ని అభిజిత్ మోనాల్‌కు చెప్పుకొచ్చాడు. నాకూ ఒకరు ఉండేవారని మోనాల్ చెప్పుకొచ్చింది. స‌రేగానీ నాతో మాట్లాడతా అని ఒట్టేయ‌మ‌ని అభిజిత్ మ‌రీ మ‌రీ అడిగాడు. ఆ త‌ర్వాత హారిక‌కు నువ్వంటే ఇష్టమ‌ని మోనాల్ చెప్పింది. కానీ నీకు మాత్రం నేనంటే ఇష్టం లేదు క‌దూ అని అడిగాడు. ఇష్టం లేక‌పోతే నీతో కూర్చుని ఇన్ని గంట‌లు మాట్లాడ‌తారా? అనిమోనాల్ ముసిముసిగా న‌వ్వుతూ స‌మాధాన‌మిచ్చింది. (నోయ‌ల్ సింప‌తీ కార్డ్ ప్లే చేశాడా?)

డ్యాన్సు, స్కిట్‌తో అద‌ర‌గొట్టిన హారిక‌
అఖిల్ పులిహోర‌ క‌లిపితే, సోహైల్ తాళింపు పులిహోర చేస్తాడ‌ని దివి అంది. ఆ త‌ర్వాత మార్నింగ్ మ‌స్తీలో హారిక పొట్టి బ‌ట్ట‌లేసుకుని ఐట‌మ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. అఖిల్‌తో క‌లిసి ర్యాంప్ వాక్ చేసింది. త‌ర్వాత అవ్వ‌తో క‌లిసి చేసిన స్కిట్ వీర లెవల్లో పండింది. ఈ స్కిట్‌లో నోయ‌ల్ బ‌ల‌య్యాడు. మెహ‌బూబ్ కాసేపు కండ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఆ త‌ర్వాత మెహ‌బూబ్‌‌ అమ్మ రాజ‌శేఖ‌ర్ ముందు కావాల‌ని దివిని ఎత్తుకుని తిప్పాడు. దీంతో క‌డుపు మండిపోయిన మాస్ట‌ర్‌ క‌ళ్యాణిని ఎత్తుకుని చూపించ‌రా అన‌గానే ముందు దండం పెట్టి త‌న వ‌ల్ల కాద‌న్న‌ప్ప‌టికీ త‌ర్వాత మ‌ళ్లీ అదే సాహ‌సానికి పూనుకుని విజ‌య‌వంతంగా ఎత్తాడు. భోజనం స‌మ‌యంలో అఖిల్ మోనాల్‌కు తినిపించ‌డంతో అభిజిత్ ముఖం వాడిపోయింది. అనంత‌రం సుజాత క‌న్ఫెష‌న్ రూమ్‌కు వెళ్లి టాస్క్ వివ‌రాలు రాసి ఉన్న లేఖ‌ను తీసుకెళ్లి చ‌దివింది. ల‌గ్జరీ బ‌డ్జెట్ టాస్క్‌లో భాగంగా బీబీ టీవీ టాస్క్ ఇచ్చారు, దీని ఏకైక ల‌క్ష్యం ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. (బిగ్‌బాస్‌: దేత్త‌డి హారిక‌పై నెటిజ‌న్ల ఫైర్‌!)

బురిడీ కొట్టించిన‌ ప‌నిమనిషి దేవి
టాస్క్‌లో భాగంగా ఇంటిస‌భ్యులు అత్తా అల్లుడు-అమెరికా మోజు సీరియ‌ల్ చేశారు. గ‌య్యాలి అత్త‌గా క‌ళ్యాణి, ఆమె కొడుకు, కోడ‌లుగా అభిజిత్‌, సుజాత, ‌క‌ళ్యాణి కూతురిగా దివి, అమెరికా అబ్బాయిగా అఖిల్, పుల్ల‌లు పెట్టే ప‌నిమనిషిగా దేవి, మ‌తిమ‌రుపు అకౌంటెంట్‌గా సాయికుమార్‌ పాత్ర‌లను అల్లుకుపోయారు. సీరియ‌ల్ మ‌ధ్య‌లో క‌మ‌ర్షియ‌ల్ యాడ్ చేస్తున్న నోయ‌ల్‌, హారిక‌, సోహైల్‌, అరియానాల‌ను గంగ‌వ్వ చీపురు ప‌ట్టుకుని చిత‌క్కొట్టింది. అయితే ఇదంతా చీపురు పబ్లిసిటీ కోసమే. త‌ర్వాత ప‌నిమ‌నిషి దేవి మ‌తిమ‌రుపు అకౌంటెంట్‌తో క‌లిసి హొయ‌లు పోతూ అత‌డిని బురిడీ కొట్టించి డ‌బ్బులు గుంజింది. ఇంత‌లో మ‌ళ్లీ యాడ్‌.. ఇందులో అటు మోనాల్ కుటుంబం, ఆమెను చూడ‌టానికి వ‌చ్చే పెళ్లికొడుకుగా అమ్మ రాజ‌శేఖ‌ర్‌ కుటుంబం కూడా విగ్గు బ్యాచే. కానీ నిజ‌మైన జుట్టులా ఇద్ద‌రూ తెగ న‌టించి చివ‌ర్లో విగ్గూడ‌గొట్టుకుని దానికి ప్ర‌చారం క‌ల్పించారు. (హౌస్‌లో ఫ‌స్ట్ ఫిజిక‌ల్ టాస్క్‌)

అమెరికా అబ్బాయికి దివి పంచ్‌లు
బ్రేక్ అయిపోగానే మ‌ళ్లీ సీరియ‌ల్ స్టార్ట్‌.. కాస్త స్పీడెక్కువ‌న్న అఖిల్‌‌, దివితో క‌లిసి ఏకాంతంగా మాట్లాడ‌తాన‌న్నాడు. అలా ఏ ఫుడ్ అంటే ఇష్ట‌మ‌ని అఖిల్ అడ‌గ్గానే దివి పులిహోర అని చెప్పింది. అంటే ఏంటో తెలీదన‌గానే, 'నిన్ను చూస్తే బాగానే క‌ల‌ప‌డం వ‌చ్చిన‌ట్లుగా ఉందే" అని అనుమానం వ్య‌క్తం చేసింది. మ‌ధ్య‌లో దేవి వ‌చ్చి ఆ అబ్బాయి పేప‌రు మీద అమ్మాయి అని రాసున్నా వ‌ద‌ల‌డు అని పెళ్లిచూపుల‌ను పెటాకులు చేసే ప్ర‌య‌త్నం చేసింది. ఆ ప్ర‌య‌త్నం స‌ఫ‌ల‌మ‌వుతున్న‌ట్లు క‌నిపించినా చివర్లో అఖిల్ త‌న‌కు దివి పిచ్చిపిచ్చిగా న‌చ్చింద‌ని ల‌గ్గానికి ముహూర్తాలు పెట్టేయ‌మన్నాడు.  కొన్ని డైలాగులు వాడి, డ్రామా పండించి అత్త క‌ళ్లు తెరిపించాడు. ప‌నిమ‌నిషికి, అకౌంటెంట్‌కు మ్యాచ్ క‌లిపేశారు. ఇది అటూఇటుగా కాస్త‌ తెలిసిన స్కిట్టే అయినా బాగానే చేశారు. అనంత‌రం ఇంటి స‌భ్యులంద‌రూ క‌లిసి ర్యాప్ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. మొత్తానికి నేటి ఎపిసోడ్ బాగానే జ‌రిగింది. ఇక రేప‌టి ఎపిసోడ్‌లోఅభిజిత్‌,  మోనాల్‌, అఖిల్‌ ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ మ‌రింత ముందుకు వెళ్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top