
తమిళ చిత్రాలు ఇప్పటివరకు రూ.1000 క్లబ్‌లోకి చేరలేదు. అయితే ఇతర భాషా చిత్రాలు రూ. 1000 కోట్ల క్లబ్‌ను దాటి చాలా కాలమే అయ్యింది. తాజాగా రజనీకాంత్ కథానాయకుడు నటించిన కూలీ చిత్రం ఆ రికార్డును బ్లాక్ చేస్తుందనే ప్రచారం విడుదలకు ముందు జరిగింది. అయితే ఆ చిత్రం కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుందనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ చిత్రాలు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరకపోవడం గురించి సీనియర్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఒక వివరణ ఇచ్చారు. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ఇటీవల వరుసగా అపజయాలను చవిచూస్తూ వచ్చారు..
కాగా తాజాగా ఈయన శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కించిన చిత్రం మదరాసీ. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెపె్టంబర్ 5వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. విచిత్ర ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ఒక వ్యక్తి రోడ్‌లో వేగంగా వెళ్తున్నారంటే అది ఇంతకుముందే చేయబడిన బాట అని, అదే ప్రత్యేక బాటలో వెళ్లాలంటే అంత సులభం కాదన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడు శంకర్ ,మణిరత్నం వంటి వారు ప్రత్యేక బాటను వేస్తే అందులో ఎత్తు పల్లాలే ఎదురవుతాయన్నారు.
ఇతర భాషా చిత్రాలు రూ.1000 కోట్ల పైగా వసూలు చేస్తున్నాయని చెబుతున్నారని, ఇతర దర్శకులు ఎంటర్‌టైనింగ్ మాత్రమే చేస్తున్నారని, తమిళ దర్శకులు మాత్రం ఎడ్యుకేట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది తమిళ దర్శకులు ఎడ్యుకేషన్ చేస్తున్నారని అన్నారు. అందువల్లే ఇతర చిత్ర పరిశ్రమలకు, తమిళ చిత్ర పరిశ్రమకు చాలా వ్యత్యాసం ఉందని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ పేర్కొన్నారు.